https://oktelugu.com/

YCP: వైసిపి ‘కాపు’ ఫార్ములా.. ఫలిస్తుందా?

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. అయితే వీలైనంతవరకు కాపుల నియోజకవర్గాలను మార్చేందుకు జగన్ సాహసించలేదు. ఒక్క గుడివాడ అమర్నాథ్ తప్పించి కాపు మంత్రుల జోలికి వెళ్లలేదు.

Written By: , Updated On : March 5, 2024 / 10:35 AM IST
YCP

YCP

Follow us on

YCP: ఏపీలో జరిగే ప్రతి ఎన్నికల్లో కాపు ఓటర్లే గెలుపోటముల నిర్దేశకులు. వారి మద్దతు ఎవరికి ఉంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. 2014లో కాపులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. 2019లో వైసీపీ వైపు మొగ్గారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగారు. అందుకే ఈ ఎన్నికల్లో కాపు ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి కాపుల్లో మెజారిటీ వర్గం పవన్ వెంట నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అంతిమంగా వైసీపీకి నష్టం చేకూరుస్తుంది. టిడిపి, జనసేన కూటమికి కలిసి వస్తుంది. అందుకే ఇప్పుడు జగన్ కాపు ఫార్ములాను అనుసరిస్తున్నారు. కాపులకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. అయితే వీలైనంతవరకు కాపుల నియోజకవర్గాలను మార్చేందుకు జగన్ సాహసించలేదు. ఒక్క గుడివాడ అమర్నాథ్ తప్పించి కాపు మంత్రుల జోలికి వెళ్లలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం వీలైనంతవరకు కొనసాగించారు. టిడిపి, జనసేన కంటే ఎక్కువగా కాపు నేతలకు టికెట్లు ఇస్తున్నారు. అటు కాపు పెద్దలుగా ఉన్న ముద్రగడ, హరి రామ జోగయ్య వంటి నేతల కుటుంబాలను వైసీపీ వైపు రప్పించుకున్నారు. ఈ చర్యలన్నీ కాపు ఫార్ములా లో భాగంగానే జగన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎక్కడికక్కడే కొత్త ప్రయోగాలకు తెర తీసినట్లు సమాచారం.

జనసేనతో కాపు మెజారిటీ వర్గం వెళుతుందని అంచనాలు ఉన్నాయి.గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ చర్యలు సైతం కాపులకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే కాపు మెజారిటీ వర్గం జగన్ తీరును వ్యతిరేకిస్తోంది. దీంతో కాపుల నుంచి వచ్చే ఇబ్బందులను గమనించిన జగన్.. ఎన్నికల ముంగిట వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కాపులకు సంబంధించి ప్రత్యేక పథకాలను అమలు చేశారు. నామినేటెడ్ పదవుల్లో సైతం వారికి పెద్ద పీట వేశారు. ఇప్పుడు అసెంబ్లీ సీట్లను అధికంగా కేటాయించి వారి మనసు గెలుచుకోవాలని భావిస్తున్నారు.

వాస్తవానికి కాపు ఓట్లకు గండి పడుతుందని జగన్ కు సైతం తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తాను ఉన్నారు.ముందుగా కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. కాపు,బలిజ,ఒంటరి, తెలగ.. అన్ని వర్గాలను విభజించి.. ఉప కులాల మధ్య అంతరం పుట్టించారు. నామినేటెడ్ పదవుల్లో సమతూకం పాటించారు. అటు జనసేనకు కాపుల ఓట్లు పూర్తిస్థాయిలో బదలాయింపు జరగకుండా.. జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అటు జనసేనపై సైతం కాపు నేతలతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు దక్కడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూటమి మధ్య పొత్తు విచ్చిన్నానికి జగన్ ప్రయత్నాలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట జగన్ కాపు ఫార్ములా తో బలంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇప్పటికే కాపు సామాజిక వర్గం వైసీపీ సర్కార్ చర్యలపై విసిగి వేశారి పోయింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.