YCP: వైసీపీ ఓటమి సాకులు.. టిడిపి ఖుషి

మాచర్లలో రిగ్గింగ్ జరిగిందని.. దానికి అడ్డుకట్ట వేసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ఈవీఎంలను ధ్వంసం చేశారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టారు.

Written By: Dharma, Updated On : May 24, 2024 9:35 am

YCP

Follow us on

YCP: సాధారణంగా ఎన్నికల అన్నాక గెలుపోటములు ఉంటాయి. అయితే ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తాం అన్న ప్రకటన చేస్తారు. అయితే పోలింగ్ తర్వాత, కౌంటింగ్ కు ముందు వచ్చే ప్రకటనలు బట్టి గెలుపోటములపై ఒక నిర్ణయానికి రావచ్చు. గత ఎన్నికల సమయంలో పోలింగ్లో అవకతవకలు జరిగాయని.. రిగ్గింగులు చేశారని.. రీ పోలింగ్ నిర్వహించాలని అప్పటి అధికారపక్షం టిడిపి నుంచి డిమాండ్లు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ కు వినతులు వెల్లువెత్తాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమి సాకుల కోసమే అప్పట్లో టిడిపి అలా చేసిందని వైసిపి ఎంజాయ్ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. ఎన్నికల్లో అవకతవకలపై వైసీపీ గగ్గోలు పెడుతోంది. టిడిపి ఎంజాయ్ చేస్తోంది.

మాచర్లలో రిగ్గింగ్ జరిగిందని.. దానికి అడ్డుకట్ట వేసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ఈవీఎంలను ధ్వంసం చేశారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టారు. వైరల్ చేశారు. ఇక పిన్నెల్లికి ముందస్తు బెయిల్ లభించడంతో.. అప్పటివరకు దాక్కున్న వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్లు జరిగాయని.. రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. దీంతో టిడిపి నేతలు ఖుషి అవుతున్నారు. వైసీపీ నేతలు ఓటమిని ఒప్పుకున్నట్టు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సత్తెనపల్లిలో చాలా కేంద్రాల్లో టిడిపి రిగ్గింగ్ చేసిందని సాక్షాత్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకే అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ని కోరారు. అంతటితో ఆగకుండా హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే.. విదేశాల నుంచి సాక్షి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అవకతవకలపై ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా అదే తరహా ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ నాయకులంతా ఇదే తరహా మాటలు చెబుతుండడంతో.. ఓటమి సాకులు అంటూ టిడిపి ఖుషి అవుతోంది.