Anil Kumar Yadav: ఏదైనా నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా బాగా పనిచేస్తే అదే స్థానంలో టిక్కెట్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ పనితీరు బాగాలేదని వేరే నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నారు. మంత్రులను ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్పులు చేస్తున్నారు. దీనిని గొప్పగా వర్ణించుకుంటున్నారు. అయితే ‘మన ఇంట్లో చెత్త పక్క ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా’ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే అవి ఏవి మాకు తెలియవు.. మాకు జగన్ టికెట్ ఇస్తున్నారు.. పోటీ చేస్తున్నాం.. గెలిచి ఏం చేస్తారన్న ప్రశ్నకు.. ప్రత్యర్థులపై విరుచుకుపడతాం అన్న సమాధానం చెబుతున్నారు. ఇందుకు మాకు ప్రజలు సహకరిస్తున్నారు.. వారికి కృతజ్ఞతలు అంటూ ధైర్యంగా చెబుతున్నారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. గత ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. అయినా సరే జగన్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. మూడేళ్లలో ఆయన ప్రజలకంటే, తన శాఖ ప్రగతి కంటే జగన్ భజనకు, ప్రత్యర్థులను తిట్టేందుకు ప్రాధాన్యమిచ్చారు. భారీ నీటిపారుదల శాఖను తన వద్ద పెట్టుకొని… నోటి పారుదలతో కాలం గడిపేశారు. ఇప్పుడు ఆయనకు గ్రాఫ్ తగ్గిపోయిందట. అందుకే నెల్లూరు సిటీ బదులు.. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించారట. తాను ఐదేళ్లపాటు నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అనిల్ ధైర్యంగా చెబుతున్నారు. మరి అదే జరిగితే ఈ స్థానచలనం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఓటు వేసేందుకు ప్రజలు కావాలి. ఆ అవకాశం ఇచ్చిన పార్టీకి సేవ చేయాలి. అనిల్ కుమార్ యాదవ్ కాదు.. జగన్ అంటే ప్రాణమిచ్చే కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా అందరిదీ ఇదే ఫార్ములా. ఓటు వేసేది ప్రజలు. కానీ వీరు మాత్రం అధినేతపై ఈగ వాలనివ్వరు. చంద్రబాబు, పవన్ లపై విరుచుకుపడతారు. అదే ప్రజా ప్రతినిధి విధులని భావిస్తారు. కానీ మేము ప్రజలకు జవాబుదారితనం అని ఏనాడు భావించిన దాఖలాలు లేవు. నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చే సమాధానం మేము చంద్రబాబుకు బూతులు తిట్టాం.. పవన్ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడడం అని మాత్రమే చెప్పగలరు.
నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ అవకాశమిచ్చారు. దీనికి కృతజ్ఞతగా అనీల్ చేసిన ప్రకటన మరి ఎబెట్టుగా ఉంది. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఇన్నాళ్లు అసెంబ్లీకి వెళ్లి చంద్రబాబుకి తిట్టాను.. ఎంపీగా గెలిచి పార్లమెంటులో సైతం చంద్రబాబును తిడతాను అంటూ అనిల్ సెలవు ఇవ్వడం దేనికి సంకేతం? ఇటీవల జగన్ తనను తాను అర్జునుడిగా పోల్చుకున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేసిన మీకెందుకండీ రామాయణ, మహాభారత ఉదాహరణలు అంటూ నాగబాబు సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. దానికి వెంటనే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవిత్ర దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే మీకెందుకు సార్ ఉదాహరణలు అంటూ కౌంటర్ అటాక్ చేశారు. నీటిపారుదల శాఖ విషయంలో, ప్రాజెక్టుల స్థితిగతుల విషయంలో వచ్చిన విమర్శలను మాత్రం అంబటి తిప్పి కొట్టలేకపోతున్నారు. అంటే ఓటు వేసిన ప్రజలకు మేము జవాబుదారీ కాదు. కేవలం మేము జగన్ సేవకులు మాత్రమేనని సెలవిచ్చేందుకు వీరు భయపడడం లేదు. ఇటువంటి నేతలను పక్క జిల్లాలకు పంపించి.. అక్కడి ప్రజలతో ఒప్పించి ప్రజా ప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. ఇక తేల్చుకోవాల్సింది ప్రజలే.