Sri City : ‘శ్రీసిటీ’ ట్వీట్ ఫైట్ : ఇంతకీ ఈ ఘనత బాబుదా? జగన్ దా?’

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పరిశ్రమలకు సంబంధించి ఒప్పందాలు, ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబు కొన్ని పరిశ్రమలను ప్రారంభించారు. అయితే అవి జగన్ హయాంలో వచ్చినవని.. వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది.

Written By: Dharma, Updated On : August 19, 2024 5:54 pm

Sri City

Follow us on

Sri City : తిరుపతి జిల్లా శ్రీ సిటీలో చంద్రబాబు పర్యటించారు. 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించారు. మరో ఏడు నూతన సంస్థలకు శంకుస్థాపన చేశారు. అక్కడే ఉన్న బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓ లతో ఆయన సమావేశం అయ్యారు. పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు వారికి వివరించే ప్రయత్నం చేశారు. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా తయారు చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఐ జి బి సి గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నట్లు కూడా చంద్రబాబు వివరించారు. శ్రీ సిటీని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. పూర్తిగా మౌలిక వసతులు కల్పిస్తామని.. కేవలం పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా.. నివాసయోగ్య ప్రాంతంగా మార్చుతామని.. పచ్చదనానికి పెద్ద పీట వేస్తామని హామీలు గుప్పించారు.అయితే ఇదే విషయంపై టిడిపి సోషల్ మీడియా పెద్దఎత్తున ప్రచారం చేస్తుండడంతో.. వైసీపీ రంగంలోకి దిగింది. ఇది సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఇలా చేయడానికి కొంచమైనా సీఎం చంద్రబాబుకు సిగ్గుండాలని వైసిపి అధికారికంగా ట్విట్ చేసింది. శ్రీ సిటీలో చంద్రబాబు ప్రారంభించిన కంపెనీలన్నీ ఆయనను చూసి రాలేదని.. అవన్నీ జగన్ హయాంలో వచ్చినవేనని గుర్తు చేసింది. ఎదుటివారి కష్టాన్ని దొడ్డిదారిలో కొట్టేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజాలు దాచినా.. టిడిపి ఫేక్ బతుకులు గురించి జనాలకు తెలుసు అని వైసీపీ ఘాటుగా విమర్శించింది. ప్రస్తుతం ఈ విమర్శలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* కీలక పరిశ్రమలకు శ్రీకారం
చంద్రబాబు శ్రీ సిటీలో పర్యటించి పరిశ్రమల ప్రారంభం, కొన్ని పరిశ్రమలకు భూమి పూజ చేశారు. ఈ క్రమంలో కొన్ని రకాల కామెంట్స్ చేశారు. వివిధ కంపెనీల సీఈఓ లతో సమావేశమయ్యారు. ఆ క్రమంలో కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. విమర్శలు గుప్పించడం ప్రారంభించింది. వైసిపి శ్రేణులు ఈ పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నాయి. తెగ ట్రోల్ చేస్తున్నాయి.

* టిడిపి కౌంటర్ అటాక్
మరోవైపు వైసీపీ చేస్తున్న విమర్శలపై టిడిపి కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. సిగ్గు లేనిది ఎవరికి అని ప్రశ్నించింది. శ్రీ సిటీలో ఉన్న కంపెనీలన్నీ చంద్రబాబు తెచ్చినవేనని గుర్తు చేసింది. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను కనీసం ప్రారంభించలేని స్థితిలో జగన్ ఉండిపోయారని ఎద్దేవా చేసింది. అందుకే చంద్రబాబు వాటిని తిరిగి ప్రారంభిస్తున్నారని తన ట్విట్ లో పేర్కొంది. జగన్ ని చూస్తే గంజాయి బ్యాచ్, ఎర్రచందనం బ్యాచ్, గొడ్డలి బ్యాచ్, ఫ్యాక్షన్ బ్యాచ్ వస్తాయి కానీ.. కంపెనీలు వస్తాయా? అని టిడిపి వెటకారంగా ప్రశ్నించింది.

* తారాస్థాయిలో వార్
గత కొద్ది రోజులుగా టిడిపి, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ప్రతి చిన్న అంశంపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసిపి మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో టిడిపి జగన్ నే నేరుగా టార్గెట్ చేస్తుండడంతో వివాదం మరింత ముదురుతోంది. ఇరుపక్షాలు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే శ్రీ సిటీపై పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నిజం అనేది వారికే ఎరుక.