https://oktelugu.com/

CM Chandrababu: ఇద్దరికీ గవర్నర్ పోస్ట్ కావాలి.. చంద్రబాబు మద్దతు ఎవరికి? టిడిపిలో కొత్త టెన్షన్!

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు సమకాలీకులైన నేతలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. ఈసారి పరిస్థితుల దృష్ట్యా వారు పోటీకి దూరంగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 9, 2024 / 02:08 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. ఇదే విషయాన్ని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని రకాల పదవులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. మూడు పార్టీల కూటమి కావడంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి పదవులు కేటాయించాల్సి ఉంటుంది. అయినా సరే తెలుగుదేశం పార్టీకి తొలి ప్రాధాన్యం అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. అయితే నామినేటెడ్ పదవులు విషయంలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి మాజీ మంత్రుల వరకు కాచుకొని కూర్చున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలామంది నేతలు ఉన్నారు. అవసరాలు రీత్యా వారు పక్కకు తప్పుకున్నారు. వారసులకు ఛాన్స్ ఇచ్చారు. అయినా సరే గౌరవప్రదమైన రిటైర్మెంట్ ను కోరుకుంటున్నారు. అటువంటి వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు లాంటి వారు ఉన్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి వీరు పని చేస్తున్నారు. చంద్రబాబుకు సమకాలీకులు. అత్యంత సన్నిహితమైన నాయకులు. చంద్రబాబుకు కావాల్సిన వారు కూడా. అయితేవీరికి రాజ్యసభ పదవులు కానీ.. అంతకుమించి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వారు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి చిన్నా చితకా పదవులు ఇస్తే తీసుకునే ఛాన్స్ లేదు. అది హుందాగా ఉండదు కూడా. అందుకే వీరి విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    * విజయనగరం సంస్థానాధీశుడు
    అశోక్ గజపతిరాజు సీనియర్ నాయకుడు. విజయనగరం సంస్థానాధీశుడు. పార్టీ కోసం కష్టపడ్డారు. చంద్రబాబు వెన్నంట నడిచారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమార్తెకు అసెంబ్లీకి పంపించారు. అయితే అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఆయన సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం. ఆయన మనసు గవర్నర్ పదవి పై ఉన్నట్లు తెలుస్తోంది.ఆ పదవితోనే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అశోక్ చెబుతున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

    * యనమల సీనియరే
    యనమల రామకృష్ణుడు సైతం చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత. ఆర్థిక శాఖ మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా సేవలందించారు. టిడిపి క్లిష్ట సమయంలో ట్రబుల్ షూటర్ గా పని చేశారు. అందుకే ఆయన సైతం తనకు మంచి పదవి కావాలని కోరుకుంటున్నారు. అప్పుడే హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ రామకృష్ణుడు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. జాతీయ రాజకీయాలకంటే గవర్నర్ గిరి కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

    * కేంద్రం ఇస్తుందా?
    కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర. ఆ పార్టీకి ఉన్న 16 పార్లమెంట్ స్థానాలతోనే ఎన్డీఏ నిలబడింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ప్రాధాన్యం దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికోసమే ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరూ కావాల్సినవారు, ఆపై సన్నిహితులు కావడంతో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలి.