Land Registration : ఒకవైపు విలువ పెంపు.. మరోవైపు రద్దు.. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ లపై చంద్రబాబు స్ట్రాంగ్ డెసిషన్!

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం వాసనలు కూడా ఉండకూడదని భావిస్తోంది. ముందుగా పథకాల పేర్లు తొలగించింది. ఇప్పుడు నాటి నిర్ణయాలను రద్దు చేస్తోంది.

Written By: Dharma, Updated On : August 9, 2024 2:10 pm
Follow us on

Land Registration : వైసీపీ అధినేత మానస పుత్రికలు సచివాలయాలు. పల్లె ముంగిటకే పాలన తేవాలన్న ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు జగన్.ప్రతి నాలుగువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.11రకాల కార్యదర్శులను నియమించారు. సంక్షేమ పథకాలతో పాటు పౌరసేవల బాధ్యతను వారికి అప్పగించారు. దాదాపు ప్రభుత్వపరంగా అందుతున్న సేవలను.. సచివాలయాల ద్వారా అందించాలని డిసైడ్ అయ్యారు. చివరకు భూ రిజిస్ట్రేషన్లు సైతం సచివాలయాల్లో జరిగేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావించారు. కానీ ఇంతలో అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరుగున పడిపోయింది. గత వైసిపి ప్రభుత్వనిర్ణయాలను సమీక్షిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన మార్పులపై సమీక్షించారు. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువల పెంపు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు వంటివి ఉన్నాయి. వీటికి ఆమోదముద్ర వేస్తూ చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరకూ, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య గ్యాప్ ఉందని గుర్తించారు. దీంతో ఈ విలువను సరి చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ విలువను 10 నుంచి 20% పెంపునకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మదించాల్సి ఉంది. దీనికి దాదాపు 45 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. అనంతరం అధికారులు అందించే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై చంద్రబాబు ప్రత్యేక ప్రకటన చేయనున్నారు.

*రిజిస్ట్రేషన్ లపై ఆరోపణలు
వాస్తవానికి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లపైనే విమర్శలు ఉన్నాయి. చాలా రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు అంటే ఆందోళనకర అంశమే. అయితే ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో జరపాలని నాడు వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది.ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాలను ఎంపిక కూడా చేసింది. అక్కడ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదు. ఎన్నో రకాల వైఫల్యాలు వెలుగు చూశాయి.

* సాంకేతిక సమస్యలు
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లపై చంద్రబాబుకు అధికారులు ప్రత్యేకంగా నివేదించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఇష్టపడడం లేదని కూడా వివరించారు. అందుకే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లను నిలిపివేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ ప్రక్రియ రద్దుకు సంబంధించి చంద్రబాబు ఆమోదం తెలిపారు. త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.

* అన్ని అంశాలపై సమీక్ష
జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ పరమైన అంశాలలో మార్పులు తీసుకొచ్చారు. కొన్నింటిని రద్దు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోతో పాటు పేరును తొలగించనున్నారు. రాజముద్రతో ప్రచురించనున్నారు. సర్వే రాళ్లపై ఫోటోలను కూడా తీసేయనున్నారు. ఇప్పుడు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే జగన్ పేర్లనే కాదు.. ఆయన నిర్ణయాలను సైతం తప్పుపడుతూ.. పక్కన పెడుతున్నారు చంద్రబాబు.