Jagan Praja Darbar: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అయితే ప్రజలు తన వద్దకు రావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు ఉన్నారు. తాను మాత్రం ప్రజల్లోకి వెళ్లాలంటే భద్రతా చర్యలను సాకుగా చూపుతున్నారు. అదే పార్టీ నేతల జైలు పరామర్శలకు, సంతాప సభలకు మాత్రం జగన్ నిర్మొహమాటంగా వెళుతున్నారు. భారీగా జన సమీకరణ నడుమ ఆయన పర్యటన కొనసాగుతోంది. ప్రజల మధ్యకు రావడానికి మాత్రం ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు. అప్పుడే కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అయిపోయింది. ఇంకా ఉన్నది మూడున్నర ఏళ్ల కాలం మాత్రమే. అయితే చివరి ఏడాది ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు ఉన్నారు. అయితే అది పెద్దగా వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* హోదా ఇవ్వకపోవడంతో..
ఏడాదిన్నరగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి సభకు హాజరు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). ప్రజల మధ్యకు వచ్చి అదే మాట చెబుతున్నారు. తనకు హోదా ఇవ్వలేదు కాబట్టి తాను శాసనసభకు హాజరు కానని మొండిగా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు పులివెందులలో ప్రజా దర్బారు నిర్వహించి స్వీకరించిన వినతులను ఏం చేస్తారన్నది ప్రశ్న. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానన్న ఆయన.. ఈ వినతులు తీసుకుని ఎవరిపై ఒత్తిడి చేయగలరు? ఎవరిపై పోరాటం చేస్తారు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. కేవలం బలప్రదర్శనతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం తప్పించి ఆయన కొత్తగా ఏం చెబుతారు అనేది విశ్లేషకుల మాట.
* ఓటమి భయంతోనే..
మొన్నటి పులివెందుల( pulivendula ) జడ్పిటిసి ఎన్నికలు జగన్మోహన్రెడ్డిని కలవర పెడుతున్నాయి. ఎవరిని నమ్మకూడదు అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు. ఇప్పటివరకు పులివెందులకు ప్రాతినిధ్యం వహించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకుడు. అయితే పులివెందులలో దెబ్బ తగలడంతో మేల్కొన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చి ఊరుకుంటే కుదరదని భావిస్తున్నారు. తన పని తాను చేయకపోతే పులివెందుల ప్రజలు తనను మరిచిపోతారని భయంతో ఉన్నారు. గతంలో కుప్పం గతంలో కుప్పం నియోజకవర్గంపై తాము దృష్టి పెట్టినట్టు.. టిడిపి కూటమి ప్రభుత్వం పులివెందులపై ఫోకస్ చేస్తే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తరచూ పులివెందుల వెళ్తున్నారు. ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నారు.
* అధికార పార్టీ ప్రత్యేకం..
అధికార పార్టీ ప్రజాదర్బార్లు నిర్వహిస్తోంది. మంత్రి లోకేష్ మంగళగిరిలో( Mangalagiri ) ఏర్పాటు చేస్తున్న ప్రజా దర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం వస్తోంది. టిడిపి కేంద్ర కార్యాలయంలో సైతం ప్రతి వారం ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపిస్తున్నారు. అధికార పార్టీ కాబట్టి అది వీలుపడుతుంది కానీ.. ప్రతిపక్షం ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన వినతులకు పరిష్కార మార్గం చూపించాలంటే తప్పకుండా శాసనసభ వేదికగా నిలుస్తుంది. కానీ తనకు ప్రతిపక్ష హోదా రాలేదని జగన్మోహన్ రెడ్డి అదే శాసనసభను బహిష్కరించారు. అయితే ఇప్పుడు ప్రజాదర్బార్లు అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే అలా వచ్చిన వినతులకు ఎంతవరకు పరిష్కార మార్గం చూపగలరు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోవాలి.