Amaravathi Capital Bill: అమరావతి( Amaravathi capital ) రైతుల చిరకాల వాంఛ తీరనుంది. ఏపీ ప్రజల్లో ఉన్న అయోమయం తొలగనుంది. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం గుర్తించనుంది. ఈ మేరకు డిసెంబర్ లో పార్లమెంటులో అమరావతి రాజధానిగా చట్టం చేయనున్నారు. చట్టబద్ధత కల్పించనున్నారు. గత అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో మరోసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చట్టబద్ధత కల్పించాలన్నది చాలా ఏళ్లుగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం ఉండడం.. ఆపై కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో అమరావతికి చట్టబద్ధత అనేది సులువు అవుతోంది. దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కీ లేని అరుదైన గౌరవం, ఆపై ఏకంగా చట్ట ‘భద్రత’ దొరకనుంది.
* రాజధానులపై తలో మాట..
నవ్యాంధ్రప్రదేశ్ కు టిడిపి( Telugu Desam Party ) తొలి ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే అటు తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కారణాలతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆ సమయంలో మంత్రి బొత్స లాంటి సీనియర్ నేత కూడా అమరావతికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదని.. అందుకే అమరావతిని మారుస్తున్నట్లు ప్రకటన చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో కలుగజేసుకోలేదు. రాష్ట్రాల రాజధానుల ఏర్పాటు అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని.. అందులో కలుగజేసుకోలేమని ప్రకటించింది. టిడిపి తో బిజెపికి ఉన్న విభేదాలతోనే అలా ప్రకటన చేసిందని అంతా భావించారు. అయితే చాలా సందర్భాల్లో అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించిందన్న ప్రకటన వచ్చేది అప్పట్లో. అంతకుమించి స్వాంతన ఉండేది కాదు.
* ఇంకా అనుమానాలు..
అయితే తాజాగా కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు పున ప్రారంభం అయ్యాయి. కానీ అమరావతి పై అనుమానపు ఛాయలు అలానే ఉండిపోయాయి. జగన్ లాంటి మరో నేత వచ్చి అమరావతి కాదని వేరే రాజధాని ప్రకటిస్తారన్న అనుమానాలు కూడా ఉండిపోయాయి ప్రజల్లో. అందుకే ప్రజల్లో ఉన్న అయోమయాన్ని పోగొట్టాలని సిఆర్డిఏ అధికారులు కేంద్రాన్ని ఆశ్రయించారు. అమరావతి రాజధాని కి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని.. పార్లమెంటులో చర్చించి ఆమోదించాలని అటార్నీ జనరల్ వెంకటరమణను కోరారు. అయితే దేశంలో ఏ రాజధానికి కూడా గెజిట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదని.. అలా ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదని.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిమతంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
* రాష్ట్ర ప్రభుత్వం పావులు..
ప్రస్తుతం ఎన్డీఏలో( NDA) తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. అమరావతి విషయంలో చట్టబద్ధత కల్పించకపోతే వచ్చే ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. ప్రజల్లో ఉన్న అయోమయం తొలగించడంతో పాటు భారీగా పెట్టుబడులు వస్తున్న దృష్ట్యా ఇన్వెస్టర్స్ లో నమ్మకం కోసమైనా అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై అటార్నీ జనరల్ సైతం సంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక నోటు తయారు చేసి.. కేంద్ర క్యాబినెట్ కు పంపించారు. అక్కడ ఆమోదముద్ర వేసి న్యాయ శాఖకు వెళ్ళింది ఆ నోటు. అక్కడ కూడా అనేక రకాల అభ్యంతరాలు అధిగమించి ప్రస్తుతం హోం శాఖ పరిధిలో ఉంది. డిసెంబర్ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు చర్చకు రానుంది. తప్పనిసరిగా చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. నిజంగా ఇది అమరావతికి శుభపరిణామమే.