Vasireddy Padma : మహిళా నేత వాసిరెడ్డి పద్మ టిడిపిలో చేరనున్నారు. ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చారు. కూటమిలో పవన్ బెటర్ అని.. చంద్రబాబుతో పాటు లోకేష్ వేస్ట్ అని వైసిపి నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 72 ఏళ్ల వయసున్న వ్యక్తి కంటే పవన్ కళ్యాణ్ నయమంటూ చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. దీనికి కౌంటర్ గా వాసిరెడ్డి పద్మ వైసిపి పై అనుచిత కామెంట్స్ చేశారు. వైసిపి నాయకత్వాన్ని జగన్ విడిచిపెట్టి.. విజయమ్మకు అప్పగించాలని కొత్త డిమాండ్ పెట్టారు. దీంతో చంద్రబాబుపై ఈగ వాలనివ్వనని సంకేతాలు ఇచ్చారు వాసిరెడ్డి పద్మ.అదే సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో సమావేశం అయ్యారు. కీలక చర్చలు జరిపారు. టిడిపిలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆమె అధికారికంగా టిడిపిలో చేరడం ఖాయమని సమాచారం.
* మంచి ఛాన్స్ ఇచ్చిన జగన్
వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పి చాలా రోజులు అయింది. ఆమె జనసేన లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్ గా పని చేయడమే అందుకు కారణం. పవన్ కళ్యాణ్ తో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. 2009లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు అయ్యింది. ఆ సమయంలో ఆ పార్టీలో చేరారు వాసిరెడ్డి పద్మ. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు. అయితే పిఆర్పి ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కొద్దిరోజులపాటు కాంగ్రెస్లో కొనసాగారు పద్మ. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా వాయిస్ బలంగానే వినిపించారు. కానీ 2014లో పార్టీ అధికారంలోకి రాలేదు. పద్మకు ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. 2019లో పార్టీ అధికారంలోకి రావడంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మకు ఛాన్స్ వచ్చింది.
* ఆ కారణంతోనే
జగన్ సముచిత స్థానం కల్పించారు. గత ఐదేళ్లుగా క్యాబినెట్ హోదాతో సమానమైన పదవిని వెలగబెట్టారు పద్మ. కానీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అందుకు జగన్ చాన్స్ ఇవ్వలేదు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ ఓటమితో గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ సమయంలో ఎక్కడో చోట సర్దుబాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే వాసిరెడ్డి పద్మ టిడిపిలో చేరిక ఖాయమైనట్టు తెలుస్తోంది. మరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.