Vinod Kambli : ప్రస్తుతం వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జుట్టు ఊడిపోయింది. మనిషి మొత్తం నల్లగా అయిపోయాడు. ఒకప్పటిలాగా అతడికి జ్ఞాపకశక్తి లేదు. ఎదుటి మనుషులను గుర్తించడం లేదు. చివరికి తన ప్రాణ స్నేహితుడు సచిన్ టెండూల్కర్ ను సైతం గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వినోద్ కాంబ్లీ హాజరయ్యాడు. దానికి సచిన్ కూడా వచ్చాడు. అయితే సచిన్ ను వినోద్ కాంబ్లీ గుర్తుపట్టలేకపోయాడు. ప్రాణ స్నేహితుడు అలా గుర్తు పట్టకుండా ఉండేసరికి సచిన్ చాలాసేపు బాధపడ్డాడు. చివరికి వినోద్ కాంబ్లీ వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకొని.. కొన్ని విషయాలను గుర్తు చేసేసరికి వినోద్ కాంబ్లీ ఆనందపడ్డాడు. ఆ తర్వాత సచిన్ తో మాట కలిపాడు. కుశల ప్రశ్నలు అడిగాడు.. ఈ దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా ప్రచారం కావడంతో.. వినోద్ కాంబ్లీ గురించి స్పోర్ట్స్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో 1983 వరల్డ్ కప్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది.
సునీల్ ఏమన్నాడంటే..
వినోద్ కాంబ్లీ ఆరోగ్యం బాగో లేకపోవడంతో.. అతడికి అండగా ఉండేందుకు తాము కీలక నిర్ణయం తీసుకున్నామని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు..” వినోద్ కాంబ్లీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆరోగ్యపరంగా నరకం అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో మేము అతడికి అండగా ఉండేందుకు సిద్ధమయ్యాం. మా కొడుకుల వయసు ఉన్న క్రికెటర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతుండడం చూస్తే బాధ కలుగుతుంది. మా మనవళ్ల వయసు ఉన్న ఆటగాళ్లు ఇబ్బందులు దుఃఖం వస్తుంది. ఇలాంటి సందర్భంలో అలాంటి వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. దీనిని సహాయం అని చెప్పను గాని.. దానికి పేరు పెట్టడం మాకిష్టం లేదు. వినోద్ కాంబ్లీ కి అండగా ఉంటాం. అతడికి ఏం చేయాలో మాకు తెలుసు. దానిని మేము అమల్లో పెడతాం. కచ్చితంగా అతడికి మా వంతు భరోసా కల్పిస్తామని” సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వినోద్ కాంబ్లీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ సచిన్ ముందుకు రావడంలేదని.. కనీసం ప్రాణ స్నేహితుడికి సహాయం కూడా చేయడం లేదని ఆ మధ్య ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనంగా మారాయి. అయితే 1983 వరల్డ్ కప్ టీం వినోద్ కాంబ్లీ కి ఆర్థిక సహాయం చేస్తుందా? లేక విదేశాలలో ఆసుపత్రులలో చూపిస్తుందా? అతని కుటుంబానికి బలమైన భరోసా కల్పిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.