Vijayanagaram : సాధారణంగా పాము( snake) కాటు వేస్తే మనిషికి ప్రమాదం. సకాలంలో వైద్యం అందించకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. అటువంటిది విజయనగరం( Vijayanagaram) జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఓ మహిళను పాము కాటు వేయగా ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే ఆమె కోలుకోగా.. కాటు వేసిన పాము చనిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. స్థానికంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం లింగంపేట లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* బహిర్భూమికి వెళ్ళగా ఘటన లింగంపేట( lingampeta ) గ్రామానికి చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళ గురువారం రాత్రి పాముకాటుకు గురయ్యారు. భోజనం అనంతరం ఆమె బహిర్భూమికి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి వెళ్ళింది. అక్కడ చీకట్లో గమనించలేదు. పాము కాటు వేయడంతో ఆమె పెద్ద కేకలు వేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో ఆమె కోలుకున్నారు. ఆమె ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల సైతం ధ్రువీకరించారు.
* స్థానికులకు షాక్
అయితే మహిళను పాము( snake) కాటు వేసిన ప్రాంతంలో శుక్రవారం స్థానికులు పరిశీలించారు. అక్కడ పాము చనిపోయి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మహిళను కాటు వేసిన ప్రాంతంలోనే పాము చనిపోయి ఉండడాన్ని గమనించారు. ఈ ఘటనపై లెక్కవరపుకోట పిహెచ్సి వైద్యాధికారి అనిల్ కుమార్ స్పందించారు. పాము అనారోగ్యంతో ఉండి కాటు వేసిన తరువాత చనిపోయి ఉండొచ్చని.. అప్పటికే అది దెబ్బతిని ఉండడం వల్ల కూడా చనిపోయి ఉండవచ్చని అనుమానించారు. మనిషిని కరిచాక పాము చనిపోవడం అనేది ఎక్కడా జరగలేదని.. అది సైన్స్ లో కూడా లేదని చెప్పుకొచ్చారు డాక్టర్. దీంతో ఈ ఘటనను ఒక వింతగా చెప్పుకుంటున్నారు ఆ గ్రామస్తులు.