YS Jagan : ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట తీరినట్టేనా? ఎన్నోరకాల ప్రచారాలకు జగన్ తెర దించినట్టేనా? తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని స్పష్టతనిచ్చినట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నట్టు మంత్రులకు సీఎం జగన్ స్పష్టతనిచ్చినట్టు సమాచారం. గత ఏడాదిన్నరగా ముందస్తుపై అనేక రకాలు గా ప్రచారం జరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ ఎన్నోరకాలుగా ప్రచారం జరిగింది. మొన్నటికి మొన్న ఢిల్లీ నుంచి అత్యవసర కేబినెట్ మీటింగ్ కు జగన్ ఆదేశాలివ్వడంతో అది గ్యారెంటీగా ముందస్తుకేనని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేదని జగన్ తేల్చిచెప్పడం చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాదిగా జగన్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వరుస విజయాలతో తొలి మూడేళ్లు జగన్ పాలన పర్వాలేదనిపించింది. కొవిడ్ కష్టకాలంలో ఉచిత పథకాలు ప్రజలకు కూడా గొప్పగా కనిపించాయి. అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టడం, పాలన మూడేళ్లు ముగిసిన తరువాత అభివృద్ధి కోసం ప్రజలు వెతుకులాట ప్రారంభించారు. కానీ జగన్ సంక్షేమాన్ని నమ్ముకోవడంతో ప్రజలు తత్వం బోధపడింది. తొలుత అసంతృప్తి వ్యక్తం చేశారు. అనక ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. దాని ఫలితమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి. దీంతో ఇక లాభం లేదనుకున్న జగన్ ముందస్తుకు దిగుతారని అంతా భావించారు. కానీ ఆయన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు మొగ్గుచూపుతున్నారు.
నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రులకు సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది కానీ… ఎప్పుడో ఏడాదిన్నర కిందటే… ఎన్నికల సన్నాహాలు ప్రారంభించి.. కనీసం తెలంగాణతో పాటే అయినా ఎన్నికలకు వెళ్లాలని అన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గినట్లు అనే గుసగుసలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి.గడప గడపకూ మన ప్రభుత్వం ఎన్నికల ప్రచారమేనని వైసీపీ నేతలకూ తెలుసు. చేసింది చెప్పుకుని ఎన్నికలకు వెళదామని ఉబలాటపడ్డారు. అయితే ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అప్పటి వరకూ ఉందనుకున్న గ్రాఫ్.. మెల్లగా పాతాళంలోకి పడిపోవడం ప్రారంభించింది. అనేక సమస్యలు చుట్టుముట్టడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
సంక్షేమం మాటున అభివృద్ధి పూర్తిగా పడకేసిందన్న విమర్శ వైసీపీ ప్రభుత్వంపై ఉంది.ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఒక్క అభివృద్ధి పని లేదు.. రోడ్లు లేవు. పన్నులుబాదేశారు. దీంతో ఎన్నికలు ఎంత ముందు పెట్టినా కర్రు కాల్చి వాత పెడతారని రిపోర్టులువచ్చాయి. దీంతో అధికారాన్ని ముందు వదులుకోవడం ఎందుకని జగన్ ముందస్తు ఆలోచనలపై పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గారని వైసీపీ నేతలు కూడా ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఇబ్బందికరమే. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా… ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ప్రత్యేకంగా రాష్ట్ర ఎజెండాతో ఎన్నికలు జరిగేలా చూసుకుంటున్నారు. జగన్ కూడా అదే చేయాలనుకున్నారు. కానీ .. ధైర్యం చాలడం లేదు. అందుకే ముందస్తు ముచ్చటను పక్కన పడేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.