Manish Sisodia: జైలు నుంచి మనీష్ బయటికి.. వద్దంటే వెళ్లావు.. అతడి భార్య బహిరంగ లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత మార్చిలో మనీష్ ను ఈడి అధికారులు అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన బెయిల్ దరఖాస్తును కోర్టు పలుమార్లు తోసిపుచ్చింది..

Written By: Bhaskar, Updated On : June 8, 2023 3:03 pm

Manish Sisodia

Follow us on

Manish Sisodia: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 103 రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఢిల్లీలో తన నివాసంలో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు అంతర్గతంగా చర్చించారు. మనీష్ జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో అడుగడుగునా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కనీసం మనీష్ పడకగది ప్రవేశద్వారాన్ని కూడా వారు వదల్లేదు. అక్కడ కూడా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. 103 రోజుల తర్వాత భర్త మనీష్ సిసోడియా ను చూసిన భార్య సీమ సిసోడియా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. నేను,నా భర్త, కుటుంబ సభ్యులు ఇంకెన్నాళ్లు ఇలాంటి కుట్రలు ఎదుర్కోవాలో అంటూ వాపోయారు. రాజకీయాలు అంటేనే మురికిగా మారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మల్టిపుల్ స్క్లి రోసిస్

మనీష్ భార్య సీమ మల్టిపుల్ స్క్లీ రోసిస్ అనే వ్యాధి బాధపడుతున్నారు. ఇంట్లోనే గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు.. తన భర్త మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లిన నాటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. కనీసం భర్తను చూసేందుకు జైలుకు వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు అనుమతి ఇవ్వాలని పలుమార్లు జైలు అధికారులకు విన్నవించుకున్నారు. అనేక విచారణల తర్వాత కోర్టు ప్రత్యేక అనుమతితో మనీష్ తన భార్యను చూసేందుకు బయటకు వచ్చారు. పోలీస్ పహారా మధ్య మనిష్ నేరుగా తన సగృహానికి వెళ్లారు. తన భార్యను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆమె కూడా అదే స్థాయిలో భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

రాజకీయాల్లోకి వెళ్ళొద్దు

ఆ బహిరంగ లేఖలో సీమ పలు అంశాలను రాసుకొచ్చారు. “రాజకీయాల్లోకి వెళ్ళొద్దు. గతంలోనే ఈ సలహాను మనీష్ కు నేను, బంధువులు, శ్రేయోభిలాషులు సలహా ఇచ్చాం. అతను ఒక జర్నలిస్ట్.. సమాజంపై నిషితమైన అవగాహన ఉన్నవాడు. రాజకీయాలపై మక్కువ ఉన్న నేపథ్యంలో ఆ వృత్తి ని పక్కనపెట్టి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నా భర్తను కలుసుకునే అవకాశం నాకు దక్కింది. ఇంకా ఎన్ని రోజులు ఈ కుట్రలను ఎదుర్కోవాలో తెలియడం లేదు. రాజకీయాలు మురికిమయమని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేసుకోవచ్చు. కానీ చదువు కోసం అరవింద్, మనీష్ కన్న కలలను వారు మాత్రం కటకటాల వెనక్కి నెట్టలేరు. కచ్చితంగా పాలిటిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గెలిచి తీరుతుంది. మనీష్ నిన్ను చూసి గర్విస్తున్నా.. ఐ లవ్ యూ” అంటూ ఆమె లేఖను ముగించారు.

తీహార్ జైల్లో..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత మార్చిలో మనీష్ ను ఈడి అధికారులు అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన బెయిల్ దరఖాస్తును కోర్టు పలుమార్లు తోసిపుచ్చింది.. గత శుక్రవారం కూడా కోర్టు ఆయన బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. అయితే, అనారోగ్యంతో ఉన్న సీమ సిసోడియాను ఆయన కలుసుకునేందుకు కొన్ని షరతులతో అంగీకరించింది. పోలీసుల సమక్షంలో ఇంటి వద్ద లేదా ఆసుపత్రిలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఒకరోజు ఆమెను కలుసుకోవచ్చని, ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో మినహా ఎవరితో మాట్లాడరాదని, మీడియా ముందుకు వెళ్లరాదని, ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించరాదని షరతులు పెట్టింది. గత శనివారం సిసోడియాను పోలీస్ అధికారులు ఆయన ఇంటికి తీసుకు వెళ్లారు. అనంతరం ఆరోగ్యం విషమించడంతో సీమాను మళ్లీ ఆసుపత్రికి తరలించారు.