YSR Congress
YSR Congress: వైఎస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా? ఆ పార్టీ వ్యూహం మార్చిందా? అసెంబ్లీకి వెళ్లడమే ఉత్తమమని భావిస్తోందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. ఆ పార్టీకి చెందిన నేతలు కూడా బయటకు వస్తున్నారు. ధైర్యంగా ప్రకటనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు. అటు తరువాత గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత కుటుంబాన్ని పరామర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత పది రోజులుగా వైసిపి కార్యకలాపాలు భారీగా పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి తాను మారానని చెప్పి.. పార్టీకి, పార్టీ శ్రేణులకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. దూకుడు కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి హాజరవుతారని ప్రచారం నడుస్తోంది.
* ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో..
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి. కానీ దారుణ పరాజయం ఎదురయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ప్రతిపక్ష హోదాకు సంఖ్యతో సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి వాదించారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి వాదనను తెరపైకి తెచ్చారు టిడిపి కూటమి నేతలు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కాయి. కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీ నుంచి నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఒకరిద్దరు టిడిపి ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందని కూడా ప్రకటించారు. అంటే నిబంధనల ప్రకారం అసెంబ్లీలో పదో వంతు సభ్యులు ఉండాలన్నమాట. అదే నిబంధనను ఇప్పుడు తెరపైకి తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేసింది టిడిపి కూటమి ప్రభుత్వం. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అప్పటినుంచి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతూ వచ్చారు.
* గత కొద్దిరోజులుగా యాక్టివ్
అయితే గత పది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ పెరిగాయి. మరోవైపు పూర్తిస్థాయిలో వార్షిక బడ్జెట్ ( state budget)ప్రవేశపెట్టేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో దానిని సద్వినియోగం చేసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. బయట ప్రశ్నించే బదులు అసెంబ్లీ సమావేశాలకు హాజరై తమ వాయిస్ ను వినిపించవచ్చు కదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. సాధారణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించవచ్చు కానీ.. ఇవి కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావడంతో జగన్ హాజరైతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
* కూటమి నుంచి ఎదురుదాడి
అయితే టిడిపి కూటమి( TDP Alliance) బలంగా ఉంది. 164 మంది సభ్యులతో అత్యంత బలంగా కనిపిస్తోంది. ఆపై సీనియర్ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మంచి వాగ్దాటి కలిగిన నాయకులు ఉన్నారు. ఆపై గత వైసిపి ప్రభుత్వంలో బాధితులుగా మారిన నేతలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైతే మాత్రం వారంతా ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది. పైగా ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో పులివెందుల ఎమ్మెల్యే గానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. దీంతో తప్పకుండా వారంతా విరుచుకుపడతారు. అనవసరంగా అసెంబ్లీకి హాజరై అవమానాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని వైయస్సార్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.