YS Sharmila:: షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోనున్నారా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయనున్నారా? కాంగ్రెస్ హై కమాండ్ కు సంకేతాలు పంపారా? కొద్ది వారాల్లో ఈ ప్రక్రియ పూర్తికానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో తన తండ్రి పేరుతో షర్మిల పార్టీ పెట్టారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. తెలంగాణలో ఆ పార్టీలో యాక్టివ్ కావాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో మెల్లగా ఏపీ వైపు దృష్టిసారించారు. తన తండ్రికి ఉన్నత స్థానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల తర్వాత ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే తన అన్న జగన్ తో తాడోపేడో తేల్చుకునేందుకు ఆమె ఏపీలోకి ఎంటర్ అవుతున్నారని టాక్ నడుస్తోంది.
వైసీపీలో మెజారిటీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి చెందినదే. దళితులు, ముస్లింలు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పూర్తిగా జగన్ వైపు ఉన్నారు. పూర్వాశ్రమంలో అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటు బ్యాంకు. ఇప్పుడు కానీ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంటర్ అయితే ఆ వర్గాలన్నీ ఇటువైపు చూసే అవకాశం ఉంది. ఎన్నికలకు మరో మూడు నెలల వ్యాధి ఉండడంతో కనీసం నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లు టర్న్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇటీవల షర్మిల ప్రవర్తన తీరు కూడా మారింది. తమ కుటుంబ ప్రత్యర్థి అయిన నారా కుటుంబ సభ్యులకి క్రిస్మస్ బహుమతులు పంపి అందరికి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఘటన జగన్ కు సరికొత్త సంకేతాలు పంపినట్టు అయింది.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని తెలియడంతో వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. ఎప్పటికీ వైసీపీ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతోంది. మార్పులో భాగంగా బాధితులుగా మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారికి టిడిపి తో పాటు జనసేనలో స్పేస్ లేదు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయితే అటువైపు చూసే ఛాన్స్ ఉంది. టిక్కెట్లు నిరాకరిస్తున్న ఎమ్మెల్యేలకు ఓ ప్లాట్ ఫామ్ దొరికినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. షర్మిల వేస్తున్న ప్రతి అడుగును వైసీపీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎంట్రీని అడ్డు తగులుతున్నారు. అయితే తెలంగాణలో గెలుపుతో ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పై ఫోకస్ పెట్టింది. షర్మిల కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అనివార్యంగా మారింది.