Posani Krishna Murali : పోసాని… జగన్ పై ప్రేమనా? పవన్ పై కోపమా?

Posani Krishna Murali : పవన్ పై వైసీపీ ముప్పేట దాడి ప్రారంభించింది. వారాహి యాత్రలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అంటూ

Written By: Dharma, Updated On : June 23, 2023 6:59 pm
Follow us on

Posani Krishna Murali : పవన్ పై వైసీపీ ముప్పేట దాడి ప్రారంభించింది. వారాహి యాత్రలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అంటూ కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పవన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తనతో పాటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని తిడతావా? అంటూ ముద్రగడ ఏకంగా పవన్ కు లేఖ రాశారు. అది పెను వివాదానికి దారి తీసింది. కాపులు, కాపుసంఘం నేతలు, జన సైనికులు రియాక్టయ్యారు. కాపు సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య ముద్రగడకు లేఖ రాశారు.  కానీ పవన్ స్పందించకపోవడంతో ఈ రోజు ముద్రగడ మరో లేఖను విడుదల చేశారు. అది మరువక ముందే ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు.

వారాహి యాత్రలో భాగంగా పవన్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలపై మాట్లాడారు. తనను ఆకారణంగా దూషించడంతో పాటు జనసేన శ్రేణులకు ఇబ్బందులకు గురిచేస్తున్న ద్వారపురెడ్డి తాటతీస్తానంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో ఎలా గెలుస్తాడో చూస్తానంటూ సవాల్ చేశారు. అదే సమయంలో ఉద్యమం పేరిట నాయకులు ఎదుగుతున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ముద్రగడ రియాక్టయ్యారు. ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వెనుకేసుకొస్తూ ఏకంగా పవన్ కళ్యాణ్ ను తప్పపడుతూ లేఖ రాశారు. ద్వారపురెడ్డి కుటుంబం కాపు ఉద్యమాలకు అండగా నిలిచిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అటువంటి వ్యక్తిని తిడతావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ముద్రగడ లేఖను పవన్ లైట్ తీసుకున్నారు. కానీ కాపు సంక్షేమ సంఘం నాయకుడు చేగొండి హరిరామజోగయ్య స్పందించారు. లేఖ రాశారు. ముద్రగడ వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. కొన్నిరకాల ప్రశ్నలు సంధించారు.  అటు రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులు స్పందించారు. ద్వారపురెడ్డి కుటుంబం స్పాన్షర్ షిప్ తో ఉద్యమమా అంటూ.. ఉప్మా ఖర్చులు అంటూ రూ.1000 చొప్పున మనియార్డర్లు ముద్రగడకు పంపించారు. అటు కాపు సంఘాల నుంచి నిరసనలు, నిలదీతలను ముదగ్రడ ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో తనను అభిమానులచే తిట్టిస్తావా అంటూ ముద్రగడ పవన్ కు రెండో లేఖ రాశారు. పవనే స్వయంగా స్పందించాలని లేఖలో పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తనపైనా కానీ.. ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపైన కానీ పోటీచేసి గెలుపొందాలని సవాల్ చేశారు.

తాజాగా ఈ ఇష్యూపై పోసాని కృష్ణమురళీ స్పందించారు. చంద్రబాబు స్కెచ్ లో భాగంగానే పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. 1981 నుంచి కాపుల కోసం ముద్రగడ పోరాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. కాపుల కోసం తన రాజకీయ జీవితం వదులుకున్నారని..ఆయన తప్పుచేసినట్టు నిరూపించగలరా? అంటూ సవాల్ చేశారు. వంగవీటి మోహన్ రంగాను చంద్రబాబే చంపించారని ఆరోపించారు. ముద్రగడ గొప్పవాడా? చంద్రబాబు గొప్పవాడా? అని పవన్ ఆలోచించుకోవాలన్నారు. ముద్రగడను పవన్ క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు.

చంద్రబాబు అవినీతిపరుడని తిట్టిన విషయం మరిచిపోయావా అంటూ పవన్ ను ప్రశ్నించారు. అదేనోటితో చంద్రబాబును సీఎం చేయాలని కాపులను కోరుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ ల ట్రాప్ లో కాపులు పడవొద్దని పోసాని కోరారు. మొత్తానికి ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న లేఖాస్త్రంపై కమ్మ సామాజికవర్గానికి చెందిన పోసాని కృష్ణమురళీ స్పందించడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ పై ప్రేమతో ఇష్యూలో పోసాని ఎంటరయ్యారా? లేకుండా పవన్ పై కోపంతోనా? అన్న సెటైర్లు పడుతున్నాయి. గత కొన్నాళ్లుగా పవన్ విషయంలో సైలెంట్ గా ఉన్న పోసాని ఇప్పుడు సెడన్ గా ఎంటర్ కావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.