Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానన్న ప్రకటనకు ఏడాది పూర్తయింది. 2025 సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన మొదలు పెడతానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో వైసిపి జనాలు సంబరపడిపోయారు. తమ అధినేత ప్రజల్లోకి వచ్చేస్తున్నారు అంటూ తెగ ప్రచారం చేసుకున్నారు. ఏరా సీన్ కట్ చేస్తే ఏడాది ముగిసింది కానీ ఆయన జనాల్లోకి వచ్చింది లేదు. అయితే అప్పుడే జనాల్లోకి వెళ్తే అనుకున్నది సాధించలేదని ఆయన అస్మదీయ సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఏడాది కాలం పాటు జనంలోకి రాకుండా అలా గడిపేసారు జగన్. ఇప్పుడు మరో సంక్రాంతి రావడంతో ఈసారైనా జగన్ వస్తారా? రారా? అనే టాక్ మాత్రం మొదలైంది.
* అనతి కాలంలోనే తేరుకొని..
2024 జూన్ లో ఫలితాలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇక పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ ఓటమి నుంచి తేరుకున్న జగన్మోహన్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) రాజకీయ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. రాజకీయ పర్యటనలు కూడా చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులపాటు బెంగళూరులో ఉంటూ మూడు రోజులపాటు తాడేపల్లి కి వస్తున్నారు. శాసనసభకు హాజరు కావడం లేదని చెప్పి వారం వారం ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. వారాంతపు కామెంట్స్ మాదిరిగా.. ఈ వారంలో ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తెచ్చి ఎండగడుతున్నారు. అలా అనుకుంటున్నారే కానీ నిజమైన ప్రజా సమస్యలను ఆయన ప్రస్తావించడం లేదని ఒక విమర్శ ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ తాను శాసనసభకు రానని ఇప్పటికే జగన్ చెప్పారు. కానీ ప్రెస్ మీట్ లో మాత్రం శాసనసభ మాదిరిగా సీరియస్ అంశాలను లేవనెత్తడం లేదని ఒక ఆరోపణ అయితే ఉంది. కానీ జగన్ దానిని పట్టించుకునే స్థితిలో లేరు.
* భారీ కార్యక్రమం చేపట్టినా..
ఇటీవల జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించి అతి పెద్ద ఈవెంట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges) ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వైసిపి ఉద్యమం చేపడుతోంది. అందులో భాగంగా కోటి సంతకాలను సేకరించి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నివేదించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపిలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోందని నాయకత్వం ఒక అంచనాకు వచ్చింది. అంతవరకు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు ఎప్పుడు వస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రజల్లోకి రాకుండా.. ఇటువంటి కార్యక్రమాలతో ప్రయోజనం లేదని.. కచ్చితంగా జనాల్లోకి రావాల్సిందేనని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో భయపడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఆయన జనంలోనే ఎక్కువ గడిపారు. ఎన్నో రకాలుగా అప్పట్లో హామీలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇచ్చారే కానీ.. కొన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు చేశారు. అవన్నీ సంక్షేమ పథకాల్లో కొట్టుకు వెళ్లిపోతాయని భావించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో అవే మైనస్ అయ్యాయి. ఇప్పుడు ప్రజల్లోకి వెళితే ఆ వర్గాల నుంచి ప్రతికూలత వస్తుందని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే జనంలోకి వచ్చేందుకు సంశయిస్తున్నారన్న అనుమానం మాత్రం ఉంది.