Chandrababu Cases: ప్రతికూల పరిస్థితుల్లో సైతం నాయకుడు చలించకూడదు. అస్త్ర సన్యాసం చేయకూడదు. ఈ విషయంలో చంద్రబాబును ఎవరైనా సమర్థించాల్సిందే. తన ముందు ఎంతటి సంక్షోభం ఉన్న.. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆయన చలించరు. వీలైనంతవరకు వాటికి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారే కానీ.. వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. 2004లో ఓడిపోయిన చంద్రబాబు(cm chandrababu) 2009లో గట్టి సవాళ్లను ఎదుర్కొన్నారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా. ఆ సమయంలో టిడిపి నేతలంతా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోయారు. అయినా చివరి వరకు పోరాడుతూనే ఉన్నారు. కానీ ఓటమి ఎదురయింది. మళ్లీ 2014లో నిలబడ్డారు. 2019లో మళ్లీ కింద పడ్డారు. 2024లో ఎగసిపడ్డారు. అయితే ఇదంతా చంద్రబాబు సంయమనం, వ్యూహంతోనే సాధ్యమైంది. ఒక్క రాజకీయంగానే కాదు తనకు ఎదురైన కేసుల విషయంలో సైతం చంద్రబాబు వైఖరి అదే. మంచి న్యాయకోవిదులను ఆశ్రయించడం. చట్ట పరిజ్ఞానంతో తనపై నమోదైన కేసుల నుంచి ఇట్టే బయటపడుతుంటారు చంద్రబాబు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నమోదైన కేసుల నుంచి అలానే జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నమోదైన కేసుల నుంచి బయటపడ్డారు చంద్రబాబు.
ఆ కేసులన్నీ విత్ డ్రా..
వైయస్సార్ కాంగ్రెస్(ysr congress) హయాంలో చంద్రబాబుపై అవినీతి కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్రోడ్, ఇసుక పాలసీ వంటి విధానాలపై చంద్రబాబును అరెస్టు చేసింది నాటి వైసిపి ప్రభుత్వం. ఏసీబీ ద్వారా కేసులు వేసి ప్రత్యేక దర్యాప్తు బృందంతో అరెస్టు చేయించింది. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. ఏ వ్యవస్థతో అప్పుడు కేసులు పెట్టారు? ఎవరితో కేసులు వేయించారు?.. ఇప్పుడు వారితోనే ఈ కేసుల విత్ డ్రా పర్వం నడుస్తోంది. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కేసును ఉపసంహరించుకున్నారు నాటి అధికారులు.
పటిష్టమైన న్యాయ కోవిదులతో..
చంద్రబాబు న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తారన్న విమర్శ ఉంది. కానీ అక్కడ ఆయన మేనేజ్ చేయరు కానీ.. పటిష్టమైన న్యాయవాదులతో తన కేసులను వాదింప చేసుకుంటారు. మంచి న్యాయకోవీదుల సలహాలు తీసుకుంటారు. అన్నింటికీ మించి ఎటువంటి పరిస్థితిలోనైనా ఆందోళన చెందరు. సమస్య మూలాలు, పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంటారు. చంద్రబాబు కేసుల సక్సెస్ వెనుక ఉన్న కథ అదే. కానీ ప్రత్యర్ధులు ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. ఆయన న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తారన్న విమర్శను ఎక్కువగా వినిపిస్తుంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. కేవలం తన కేసుల్లో ఉన్న తీవ్రత, అవి నిలబడుతాయా? లేదా అనే అంశాలపై దృష్టి పెడతారు. అందుకు అనుగుణంగా అడుగులు వేసి కేసుల నుంచి విముక్తి పొందుతుంటారు.