YCP signature campaign: ఏదైనా చెబితే నమ్మేటట్టు ఉండాలి. అలా చెప్పగలిగితేనే నమ్మించగలను కూడా. అయితే ఇప్పుడు వైసీపీ కూడా అటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఫెయిల్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ముమ్మాటికీ ప్రైవేటీకరణ అంటూ వైసీపీ చెబుతోంది. మేము 17 ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేస్తే.. పూర్తిచేసే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని విమర్శలు చేస్తోంది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టినట్లు చెబుతోంది. అయితే మంజూరైతే చేశారు కానీ పునాదుల స్థాయిలోనే నిలిపివేశారని కూటమి ప్రభుత్వం చెప్పుకొస్తోంది. వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేస్తామంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి నొప్పి అని ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చింది. అయితే ఆ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఈనెల 18న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఆ కోటి సంతకాల సేకరణను నివేదించునున్నారు.
ఉద్యమంలా సాగిందంటూ..
రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనేది ఉద్యమంలా సాగిందని చెబుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాము కోటి సంతకాలు సేకరణ మాత్రమే చేపట్టాలనుకున్నామని.. కానీ మరో 20 లక్షల మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్నది ఐదు కోట్ల మంది జనాభా అయితే.. ప్రతి ఐదుగురిలో ఒకరు సంతకం పెట్టారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న దాంట్లో నిజం ఎంత? అనేది ఇప్పుడు కొత్త చర్చ. అయితే అది ఎంత మాత్రం సాధ్యం కాదని పొలిటికల్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పైగా ఎక్కడ ఈ కార్యక్రమం క్రియాశీలకంగా చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. వైసీపీలో అనుకున్న స్థాయి సీరియస్నెస్ కూడా కనిపించలేదు. అటువంటప్పుడు కోటి సంతకాల సేకరణ అనేది ఎలా? అనేది ప్రశ్న. కానీ దీనిని ఒప్పుకునే స్థితిలో లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
వచ్చిన ఓట్ల కంటే అధికం..
కోటి సంతకాల సేకరణ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన వింతలా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే సంతకాలి అధికంగా నమోదు అయ్యాయని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు కంటే ఎక్కువగా సంతకాలు వచ్చినట్లు చెబుతున్నారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగిందని.. అనుకున్న దానికంటే 20 లక్షల మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని చెబుతోంది వైసిపి. అయితే దానిపై నమ్మశక్యం కావడం లేదు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపట్టడం విశేషం. హైదరాబాదులో వైసిపి అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి సంతకాలను సేకరించారు. లక్షల వరకు ఒకే కానీ కోటి దాటడం పైనే ఎక్కువగా అనుమానం కలుగుతుంది. అయితే సంతకాలు అనేదానిపై ప్రామాణికంగా సంఖ్య ఉండదు. కాబట్టి వైసిపి బాధ ఏంటో తెలియంది కాదు. విపక్షంలో ఉన్నప్పుడు ఈ లెక్కలు ఇలానే చెబుతారు కూడా.