Vijayasai Reddy : పొలిటికల్ అప్రూవర్ గా విజయసాయిరెడ్డి?

అటు మీడియాలో సైతం విజయసాయిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. గతంలో వివాదాస్పద కామెంట్లు చేయడంలో ముందు వరుసలో ఉండేవారు. కానీ ఎందుకో ఉన్నపలంగా తగ్గించేశారు. దీంతో మీడియా కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

Written By: Dharma, Updated On : May 6, 2023 11:38 am
Follow us on

Vijayasai Reddy : వైసీపీ కీలక నేత పొలిటికల్ అప్రూవర్ గా మారిపోయారా? ఈ మధ్యన బొత్తిగా ఎందుకు కనిపించడం మానేశారు?ఏపీని వదిలి ఢిల్లీకే ఎందుకు పరిమితమయ్యారు? ఎవరైనా శిక్ష విధించారా? తనకు తాను విధించుకున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులతో సతమతమవుతుంటే ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ఇప్పుడు అనేక సందేహాలకు దారితీస్తోంది. నాన్ లోకల్ మాదిరిగా వ్యవహరిస్తుండడం, చుట్టంచూపునకు కూడా నోచుకోకపోవడంతో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు వైసీపీలో కనిపిస్తున్నాయి.

గతంలో దూకుడు..
జగన్ తో పాటు పార్టీపై విజయసాయి ఈగ వాలనిచ్చేవారు కాదు. అధినేత ఎటువంటి టాస్క్ ఇచ్చినా ఇట్టే చేసేవారు. అవసరమైతే అధినేత పని కోసం ఎదుటి వారికి పొర్లు దండాలు పెట్టడానికైనా సిద్ధపడేవారు. అటువంటి విజయసాయిరెడ్డిని జగన్ చేజేతులా దూరం పెట్టారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న ఆయన బుద్ధుడిగా మారిపోయారు. రాష్ట్ర రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.  కొంత కాలంగా ఆయ‌న జాతీయ అంశాల‌పై దృష్టి సారించారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, విధానాలు త‌దిత‌ర అంశాల‌పై ట్విట‌ర్ వేదిక‌గా సానుకూల పోస్టులు పెడుతూ కాలం గడిపేస్తున్నారు.

తగ్గిన వాడి..
విజయసాయిరెడ్డి  ట్విట‌ర్ ఖాతాలో శనివారం ఉదయం రెండు పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అందులో ఒక‌టి బుద్ధ భ‌గ‌వానుడి బోధ‌న‌ల గురించి, మ‌రొక‌టి హిందూ మహాస‌ముద్రంలో చైనా నౌకల ప్ర‌స్తావ‌న‌. ఈ రెండు పోస్టులు కూడా హిందీలో పెట్ట‌డం విశేషం. ఏపీ రాజ‌కీయాల‌పై ఆయ‌న‌కు ఎందుకు విరక్తి క‌లిగిందో తెలియ‌దు కానీ, పూర్తిగా పొలిటిక‌ల్ పంథాను మార్చుకున్నారు. ప్రత్యర్థులకు సైతం విషెష్ చెబుతున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు పుట్టిన రోజు పూర్తిగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ట్విట్ చేశారు. అలాగని ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కూడా మానేశారు. ఏపీ ప్రభుత్వ భజన కూడా తగ్గించేశారు.

పట్టించుకోని మీడియా..
అటు మీడియాలో సైతం విజయసాయిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. గతంలో వివాదాస్పద కామెంట్లు చేయడంలో ముందు వరుసలో ఉండేవారు. కానీ ఎందుకో ఉన్నపలంగా తగ్గించేశారు. దీంతో మీడియా కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే సొంత మీడియా సాక్షి సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది, ఏపీని విడిచిపెట్టి ఢిల్లీలో విజయసాయిరెడ్డి కులాసాగా గడుపుతుండడాన్ని అటు వైసీపీ నేతలు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి స్పందన తెలియజేయడానికి ముందుకు రావడం లేదు, అంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న మాట. పొలిటికల్ అప్రూవర్ గా మారిపోయేటంతగా విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఉంది.