https://oktelugu.com/

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో ఎవరిది పెద్దరికం? చంద్రబాబు, కెసిఆర్, జగన్ పాత్ర పై చర్చ!

రాజకీయాల్లో ఉన్నవారు మాటను పొదుపుగా వాడాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడాలి.పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడాలి. ఈ విషయంలో చంద్రబాబు బెటర్ అనేది మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయం.ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఏ విషయంపై ఎలా స్పందించాలో కూడా బాగా తెలుసు. అందుకే సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించారు. ఎన్ని రకాల ఒడిదుడుకులైనా నిలబడగలిగారు. పార్టీని నిలబెట్టుకోగలిగారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 17, 2024 6:50 pm
    Follow us on

    Chandrababu :  పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. తమకు తాముగా పెంచుకునేది.తమకు తాముగా పాటించేది. అదే ప్రజా మన్ననలను అందుకోగలుగుతుంది. తెలంగాణలో పెద్దరికాన్ని ప్రదర్శించారు కేసీఆర్. ఆయన పెద్దరికాన్ని తెలంగాణ ప్రజలు కూడా గౌరవించారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిపెట్టారు. కానీ ఆయన పెద్దరికం మితిమీరింది. ప్రత్యర్థులను చులకన చేసింది.అదే వారిలో ఐక్యతకు కారణమైంది. తెలంగాణ సమాజం కెసిఆర్ ను పట్టించుకోకుండా చేసింది. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలిస్తేనే అది నిలబడుతుంది.ఈ విషయంలో చంద్రబాబు ది బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడతారు.

    రాజకీయాల్లో ఉన్నవారు మాటను పొదుపుగా వాడాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడాలి.పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడాలి. ఈ విషయంలో చంద్రబాబు బెటర్ అనేది మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయం.ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఏ విషయంపై ఎలా స్పందించాలో కూడా బాగా తెలుసు. అందుకే సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించారు. ఎన్ని రకాల ఒడిదుడుకులైనా నిలబడగలిగారు. పార్టీని నిలబెట్టుకోగలిగారు. అయితే ఈ విషయంలో జగన్ ఫెయిల్యూర్ అయ్యారు. చిన్న వయసులోనే ఏపీ ప్రజలు ఆయనకు పెద్దరికాన్ని అప్పగించారు. ప్రజలిచ్చిన గౌరవాన్ని జగన్ మాత్రం తనకు తానుగానే పాడు చేసుకున్నారు. అయితే ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకునే స్థితిలో కూడా జగన్ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు కెసిఆర్ ను అనుసరించినట్టే.. నేడు కూడా ఫాలో అవుతున్నారు.

    ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు కూడా. ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా వారికి తెలుసు. అందుకే తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఏకాకి అయ్యారు. ఏపీ సమాజంలో జగన్ అధికారానికి దూరమయ్యారు. అక్కడ కెసిఆర్ ను విడిచిపెట్టి సొంత పార్టీ నేతలే బయటకు వెళ్తున్నారు. ఏపీలో మాత్రం జగన్ పార్టీకి చెందినవారు లోలోపల కలహాలతో కాలం గడుపుతున్నారు. అధికార కూటమి పార్టీలు తలుపు తెరిచిన మరుక్షణం.. చేరిపోయేందుకు వైసిపి నేతలు రెడీగా ఉన్నారు. అంటే అక్కడ కెసిఆర్ కు ఎదురైన దుస్థితి.. త్వరలో జగన్ కు సైతం ఎదురు కాబోతుందన్నమాట.ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చి దాదాపు రెండు నెలలు సమీపిస్తోంది. అధికారపక్షం పాలన ప్రారంభించింది. ప్రతిపక్ష హోదా దక్కని వైసిపి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇటీవల జరిగిన ఏ ఒక్క పరిణామంపై జగన్ స్పందించిన దాఖలాలు లేవు.

    రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఓ వివాదం హార్ట్ టాపిక్ గా మారింది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కేంద్రంగా.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఆమెకు పుట్టిన బిడ్డ విషయంపై చెలరేగిన వివాదం పై స్పందించిన సాయి రెడ్డి.. మీడియాపై తన అక్కసును వెళ్ళగక్కారు. అయితే ఈ వివాదం జఠిలమవుతోంది. ఒక పార్టీ అధినేతగా జగన్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రకాశం జిల్లా వైసీపీలో సరికొత్త వివాదం నడుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య గట్టి ఫైట్ నెలకొంది. దీనిపై స్పందించాల్సిన అవసరం జగన్ పై ఉంది. లేకుంటే ప్రకాశం జిల్లా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకొని అన్ని జిల్లాల్లో.. వైసీపీలో విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

    ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం జగన్ పై ఉంది. అందుకు సంబంధించిన ఘటనలు కూడా వరుసగా జరుగుతున్నాయి. పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. అత్యాచారయత్నాలకు తెగబడ్డారు. వీటిని ఖండించాల్సిన అవసరం ఒక పార్టీ అధినేతగా జగన్ పై ఉంది. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక.. స్పందించలేను అన్నట్టు ఉంది జగన్ వ్యవహార శైలి. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టు ఉంది ఆయన వైఖరి. ఇలానే కొనసాగితే మాత్రం ఏపీ ప్రజల్లోనే కాదు.. సొంత పార్టీలోను కూడా జగన్ పలుచన కావడం ఖాయం. ఇక తేల్చుకోవాల్సింది జగనే.