TTD Laddu Issue: తిరుమల లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ తిరుమల పర్యటన రద్దుతో కొత్త అంశం తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అడగడంతోనే జగన్ పర్యటన రద్దయిందన్న ప్రచారం జరుగుతోంది. డిక్లరేషన్ ఇస్తే తన మత అంశం బయటపడుతుంది. అదే సమయంలో తన సొంత మతం నుంచి అభ్యంతరాలు వస్తాయి. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో అడుగుపెడితే హిందూ సమాజం తప్పుపడుతుంది. ఈ కారణం చేతనే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ మరోసారి కార్నర్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు జగన్ ను అష్టదిగ్బంధనం చేశారు. ఆయన అన్యమతస్తుడని.. హిందూ వ్యతిరేకి అని ముద్రపడేలా చూడాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. తిరుమల వెళ్లాల్సిన జగన్ అడ్డుకున్నది ఎవరని? ఆయనకు పోలీసులు ఏమైనా నోటీసులు ఇచ్చారా? అంటూ చంద్రబాబు నిలదీయడంలోనే అసలు వ్యూహం ఉంది. కేవలం డిక్లరేషన్ ఇచ్చేందుకు భయపడి మాత్రమే జగన్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం ప్రారంభించారు. డిక్లరేషన్ ఇవ్వకుంటే టీటీడీ అధికారులు రాణించరు.. డిక్లరేషన్ ఇస్తే సొంత మతం ఒప్పుకోదు అంటూ ప్రచారం మొదలు పెట్టేశారు.
* మతం రాజకీయాలకు అడ్డు రాలేదు
జగన్ స్వతహాగా క్రిస్టియానిటీ కి చెందిన వ్యక్తి. వైయస్సార్ కుటుంబం మొత్తం క్రిస్టియన్ మతంలో ఉన్నారు. అయితే ఎన్నడూ వారి మతం వారి రాజకీయాలకు అడ్డు రాలేదు. కానీ ఈసారి మాత్రం ఆయన మత అంశం బయటపడింది. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో ముప్పేట విమర్శలకు కారణమైంది. ఇది రాజకీయంగా చేసిన కుట్రగా వైసీపీ చెబుతున్నా.. హిందూ సమాజంలో మాత్రం వైసిపి పాత్ర పై ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఇప్పుడు జగన్ మతం, అభి మతం పై పడ్డారు.జగన్ మతాన్ని మరింత బయటకు తీస్తే.. హిందువుల్లో అంత చులకన అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* జాతీయస్థాయిలో జగన్ పై చర్చ
ఈ వివాదం నేపథ్యంలో జాతీయ స్థాయిలో సైతం జగన్ చర్చకు కారణం అవుతున్నారు. వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతోంది. పైగా బిజెపి జగన్ కు మరింత దూరం జరిగింది. భవిష్యత్తులో కూడా జగన్ వైపు చూసే సాహసం చేయలేదు. చంద్రబాబు కూడా కావాల్సింది అదే. అందుకే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జగన్ పెడచెవిన పెడితే దేవాదాయ శాఖ చట్టాల ద్వారా కఠిన చర్యలకు వ్యూహం రూపొందించారు. అదే సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ప్రచారం ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. అందుకే జగన్ ఈ పర్యవసానాలన్నీ తెలుసుకొని తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
* బిజెపితో జగన్ కు మరింత దూరం
జగన్ ను ఇలా చూపి.. బిజెపితో బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలని చంద్రబాబు చూశారు. ఇప్పటికే రాజకీయంగా చంద్రబాబు అవసరం కేంద్రానికి తప్పనిసరిగా మారింది. ఒకవేళ తనను కాదని జగన్ వైపు బిజెపి చూడాలనుకున్నా.. వీలు లేని పరిస్థితిని కల్పించాలన్నదే చంద్రబాబు లక్ష్యం. ఇప్పుడు చంద్రబాబు కూడా చేసింది అదే. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా జగన్ వైపు బిజెపి చూసే పరిస్థితి లేదు. అంతలా జగన్ మతాన్ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. సొంత కులాన్ని ఆచరిస్తూనే.. ఇతర కులాలను గౌరవించాలన్న స్లోగన్ సైతం బయట పెట్టారు. తద్వారా జగన్ ఇతర కులాలను గౌరవించడం లేదన్న విషయాన్ని బయటపెట్టారు. మొత్తానికైతే జగన్ విషయంలో చంద్రబాబు పాచిక పారింది. లడ్డు వివాదం లో ఆయన పై చేయిగా నిలిచారు. జగన్ డిఫెన్స్ లో పడ్డారు.