TTD Laddu Issue: ఏపీలో లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది. తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిసిందని తొలిసారిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అప్పటినుంచి వివాదం ప్రారంభమైంది. వైసిపి కార్నర్ అయింది. ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. దాని నుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ అభివర్ణించారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుడిని రాజకీయాల్లోకి లాగారని ఆరోపించారు. సిబిఐతో కానీ.. సింగిల్ జడ్జితో కానీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అంతటితో ఆగకుండా తిరుమల వెళ్లి చంద్రబాబు ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని భావించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే అనూహ్యంగా జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఈ అంశం యూ టర్న్ తీసుకుంది. మరోవైపు సీఎం చంద్రబాబు దీనిపై ఘాటుగా స్పందించారు. జగన్ తిరుమల వెళ్ళకుండా అడ్డుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. మరోవైపు తాను లడ్డు వివాదాన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు.
* టీటీడీ పై ఫోకస్
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడి పై ఫోకస్ పెట్టింది. వైసిపి హయాంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణను ఆదేశించింది. ఈ నేపథ్యంలో లడ్డు ప్రసాదం విషయంలో వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. గతం కంటే నాణ్యత, పరిమాణం తగ్గడంతో భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో లడ్డు తయారీని పరిశీలించగా.. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న విషయం తెలిసింది. దీంతో జాతీయస్థాయిలో పేరుపొందిన గుజరాత్ ల్యాబ్ కు ఆ నెయ్యిని పంపించారు. పరిశీలించగా ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని తేలింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు అదే విషయాన్ని చెబుతున్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన వ్యవహారాన్ని ఎలా దాచి పెడతానని ఆయన ప్రశ్నించారు. అందుకే బయటపెట్టినట్లు చెప్పుకొచ్చారు.
* అన్ని దేవాలయాలపై దృష్టి
టీటీడీ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో.. అన్న ప్రసాదం నుండి అన్ని రకాల అంశాలపై దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కోట్లాదిమంది మనోభావాలు దెబ్బతినేలా లడ్డు వ్యవహారం నడిచిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసిపి తప్పు చేసిందని.. కానీ దానిని ఒప్పుకోకుండా.. మరింత రచ్చ చేసే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీటీడీ పవిత్రతను కాపాడేలా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అందుకు ఎంత దాకైనా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి
.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపితే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దానిని రాజకీయ అంశం అనుకుంటే ఎలా అని నిలదీశారు.
* వైసీపీ శ్రేణుల పూజలు
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేపట్టనున్నాయి. ఇప్పటికే హై కమాండ్ పిలుపు ఇచ్చింది. అయితే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. అధినేత తన పని తాను చేయలేదని ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పాప ప్రక్షాళన కోసమే అంటూ వైసిపి చేస్తున్న హడావిడి పై టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పోలీస్ శాఖ అలెర్ట్ అయ్యింది.