CM Jagan: జగన్ ను అత్యంత బలవంతుడిగా వైసీపీ నేతలు ప్రొజెక్ట్ చేస్తుంటారు. గత ఎన్నికల్లో అంతులేని విజయాన్ని దక్కించుకున్న జగన్ తనకు తాను బలవంతుడునని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడంలో తప్పులేదు కానీ.. ఎదుటివారి బలాన్ని.. బలహీనం చేసి.. తన బలాన్ని నిరూపించుకోవాలని తహతహలాడడం మాత్రం ఆయనలో ఉన్న వైఫల్యాన్ని బయటపెడుతోంది. చంద్రబాబు ఇలా ఢిల్లీ వెళ్లారో లేదో.. జగన్ ఎందుకు వెళ్లినట్టు? ముందస్తు షెడ్యూల్ లేకుండా.. ఆకస్మిక పర్యటన దేనికి సంకేతం? ఏపీలో తాను బలంగా ఉన్నానని చెప్పుకుంటున్న ఆయన ఎందుకు ఆందోళన చెందుతున్నట్టు? కేవలం విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం పేరు చెప్పుకొని ప్రధాని మోదీని కలిసినట్లు చెప్పుకుంటున్నా.. అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఎన్నికలకు నెల రోజులు ముందు ఇవి సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. అయినా సరే జగన్ వాటినే చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా బిజెపి రాజకీయ నిర్ణయాలు, పొత్తుల వ్యవహారం వంటివి అమిత్ షా చూస్తారు. కానీ సీఎం జగన్ ప్రధాని మోదీని మాత్రమే కలుసుకోగలిగారు. ప్రధాని కోసం గంట పాటు వెయిట్ చేసి.. పది నిమిషాలు పాటు మాట్లాడి వెనుతిరిగారు. మీడియాకు ఒక దండం పెట్టి హడావుడిగా కారు ఎక్కేశారు. ఆయన ముఖ కవళికలు బట్టి ప్రధానితో సమావేశం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. వాస్తవానికి టిడిపి, జనసేనలకు బిజెపి పొత్తు దాదాపు ఖాయమే. చంద్రబాబు సూత్రప్రాయంగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పొత్తులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నది నిజం. అటు బిజెపి పెద్దలు ఆహ్వానించింది నిజం. ఇరు వర్గాలు కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నది నిజం. బిజెపి 5 నుంచి 6 ఎంపీ సీట్లు, 10 నుంచి 12 అసెంబ్లీ సీట్లు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేనకు టిడిపి కొన్ని సీట్లను సర్దుబాటు చేసింది. దీంతో చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని ఢిల్లీ నుంచి వచ్చేశారు. ఇప్పుడు టిడిపి నిర్ణయం కోసమే బిజెపి ఎదురుచూస్తోంది. అందుకే అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా అమిత్ షా సైతం తాము పొత్తుల విషయంలో సానుకూలంగా ఉన్నామని… త్వరలో పొత్తులు కుదురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని వైసీపీ భావించింది. దానికోసం చివరి వరకు ప్రయత్నించింది. ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. చివరకు సీట్ల సర్దుబాటు విషయంలో ఒక రకమైన ఇబ్బంది పెట్టాలని చూసింది. జనసేనలోకి కొంతమంది వైసీపీ చొరబాటుదారులను పంపించి గలాటా చేయాలని చూసింది. దానికి సైతం పవన్ అడ్డుకట్ట వేయగలిగారు. అక్కడ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో.. ఇప్పుడు బిజెపితో ఆ రెండు పార్టీల స్నేహాన్ని అడ్డుకట్ట వేయాలని చూసింది. తాను బలవంతుడు అయినప్పుడు.. ప్రత్యర్థులు ఎవరైతే ఏంటి? ఎవరెవరు కలిస్తే ఏంటి? కానీ సంపూర్ణ విజయం వచ్చినప్పుడు తాను బలవంతుడినని జగన్ భావించారు. ఇప్పుడు ఓటమి కనిపించేసరికి ఎక్కడ బలహీనుడునని ప్రజలు భావిస్తారని లేనిపోని ప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్రత్యర్థులను విడగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే అది వృధా ప్రయాసగా కనిపిస్తోంది.