Nara Bhuvaneshwari: రాష్ట్ర వ్యాప్తంగా నారా భువనేశ్వరి “నిజం గెలవాలి” సంఘీభావ యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. తొలి విడతగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రాజకీయాల్లో భువనేశ్వరి ఏనాడూ పాలు పంచుకోలేదు. రాజకీయ వేదికలపై కనిపించలేదు. కానీ ఇప్పుడు భర్త అరెస్ట్ తో ఆమె బయటకు రావాల్సి వచ్చింది. పార్టీ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. అయితే తొలుతా లోకేష్ తో ఈ యాత్ర చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా భువనేశ్వరిని తెరపైకి తెచ్చారు.
అయితే భువనేశ్వరితో యాత్ర చేపట్టడానికి ప్రధాన కారణం సానుభూతి లభిస్తుందనే. గతంలో జగన్ పై కేసులు నమోదయి.. అరెస్టు చేసినప్పుడు ఆమె తల్లి విజయమ్మ, సోదరి షర్మిళలు ప్రజల్లోకి వచ్చారు. జగన్ను అక్రమంగా అరెస్టు చేశారని.. ప్రజల కోసం పోరాడిన వైఎస్ కుటుంబంలో ఇబ్బందులు పెడుతున్నారని ప్రచారం చేశారు. అప్పట్లో ఇది వర్కౌట్ అయింది. ప్రజల నుంచి విపరీతమైన సానుభూతి లభించింది. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు దోహద పడింది.
ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే జరుగుతోంది. లోకేష్ కంటే నారా భువనేశ్వరి అయితేనే ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుందని పార్టీ భావించింది. ఇప్పటివరకు భువనేశ్వరి రాజకీయ వేదికలు పంచుకోకపోవడం కలిసి వస్తుందని అంచనా వేశారు. పైగా వచ్చి ఎన్నికల నాటికి ఎన్నికల క్యాంపెయిన్ కోసం భువనేశ్వరి సైతం అక్కరకు వస్తారని భావించారు. లోకేష్ ఇప్పటికే రాజకీయాల్లో ఉండడంతో.. ఆయనతో ఈ సంఘీభావ యాత్ర చేపడితే రొటీన్ గా మారుతుందని భావించి భువనేశ్వరిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన తన భర్త చంద్రబాబును.. అక్రమంగా అరెస్టు చేశారని ఆమె చెబితే ప్రజలు తప్పకుండా సానుభూతి చూపుతారని అంచనా వేశారు. అందుకే లోకేష్ ను పక్కన పెట్టు మరి భువనేశ్వరికి సంఘీభావ యాత్ర బాధ్యతను అప్పగించారు.
నారా లోకేష్ ఇప్పటికీ పాదయాత్ర చేశారు. తండ్రి అరెస్టుతో తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తండ్రి కేసులకు సంబంధించి విచారణలు, పిటిషన్లతో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు న్యాయ కోవిదులు, లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఎక్కువ శాతం సమయం వాటికే కేటాయించాల్సి వస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదరడం వల్ల.. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేన నాయకత్వంతో నిత్యం సమావేశం కావాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను పార్టీ లోకేష్ పై పెట్టింది. అందుకే నిజం గెలవాలి సంఘీభావ యాత్రను తన తల్లి భువనేశ్వరికి అప్పగిస్తూ లోకేష్ పక్కకు తప్పుకున్నారు. ఏకకాలంలో పార్టీని, అటు తండ్రి కేసులను, ఇటు తల్లి సంఘీభావ యాత్రను, జనసేనతో సమన్వయం చేసుకోవాల్సి ఉండడంతోనే సంఘీభావ యాత్రను తల్లి భువనేశ్వరికి అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.