Salaar: ప్రభాస్ చిత్రాల్లో సలార్ కి ఉన్న హైప్ వేరు. ఆయన స్టార్డం, ఇమేజ్ ని హ్యాండిల్ చేసే సరైన దర్శకుడు దొరికాడనే భావన ఉంది. కెజిఎఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ నయా రికార్డ్స్ సెట్ చేస్తుందనే అభిప్రాయం చిత్ర వర్గాల్లో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాని కారణంగా విడుదల కాలేదు. అప్పుడు సలార్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. యూఎస్ లో కూడా హాట్ కేకుల్లా ఆన్లైన్లో టికెట్స్ అమ్ముడుపోయాయి.
అనూహ్యంగా వాయిదాపడి ఆడియన్స్ ని నిరాశపరిచింది. కొత్త విడుదల తేడాగా డిసెంబర్ 22 ప్రకటించారు. బ్యాక్ టు బ్యాక్ రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తో ప్రభాస్ పోటీపడుతున్నారు. షారుఖ్ ఖాన్ డంకీ కూడా డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించారు. సలార్ నిర్మాతల ప్రకటనతో డంకీ చిత్ర విడుదల తేదీ ఒకరోజు ముందుకు జరిపారు. అంటే డంకీ 21న విడుదల కానుంది.
బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ సలార్ థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. తెలుగు రాష్టాల్లో సలార్ రికార్డు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఏపీ/తెలంగాణ హక్కులు రూ. 175 కోట్లకు అమ్మారట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇదే హైయెస్ట్. ప్రభాస్ కెరీర్లో కూడా హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ లెక్కన సలార్ హిట్ టాక్ తెచ్చుకోవాలంటే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమాపై భారీ హైప్ ఉంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ అసాధ్యం ఏమీ కాదు. ప్రభాస్ గత మూడు చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ క్రమంలో సలార్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. సలార్ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం.