https://oktelugu.com/

YS Bharathi – YS Sunitha : వివేకా మరణం తరువాత సునీతను భారతి ఎందుకు కలిశారు? ఏం చెప్పారు?

‘2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా హత్యకు గురయ్యారు. 15 ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడకు వారం రోజుల తరువాత జగన్ సతీమణి భారతి సునీతకు ఫోన్ చేశారు. ఒకసారి కలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే తాను కడప, సైబరాబాద్ కమిషనర్లకు కలవాల్సి ఉందని సునీత చెప్పుకొచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 22, 2023 / 06:18 PM IST
    Follow us on

    YS Bharathi – YS Sunitha : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ చార్జిషీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కొక్కరి వాంగ్మూలం బయటకు వస్తుండడంతో ఇదో సీరియల్ ఎపిసోడ్ గా , సస్పెన్షన్ థ్రిల్లర్ గా మారుతోంది. చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సీబీఐ చార్జిషీట్ లో కీలక వ్యక్తుల వాంగ్మూలం పొందుపరిన సంగతి తెలిసిందే. ఇందులో తాజాగా వివేకా కుమార్తె సునీత వాంగ్మూలం బయటకు వెల్లడైంది.  జగన్ సతీమణి భారతి పేరును సునీత ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు సజ్జల సలహాలను సైతం సునీత నిర్భయంగా సీబీఐ ముందు ఉంచడం విశేషం.

    ‘2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా హత్యకు గురయ్యారు. 15 ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడకు వారం రోజుల తరువాత జగన్ సతీమణి భారతి సునీతకు ఫోన్ చేశారు. ఒకసారి కలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే తాను కడప, సైబరాబాద్ కమిషనర్లకు కలవాల్సి ఉందని సునీత చెప్పుకొచ్చారు. ఎంత సమయం తీసుకోనని చెప్పడంతో సునీత నివాసానికి వైఎస్ భారతి వచ్చారు. ఆమె వెంట వైఎస్ విజయమ్మ, సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నారు. భారతీ కంగారుగా, ఆందోళనగా కనిపించారు. నాన్న మరణంతో బాధతో ఉన్నారు అనుకున్నా. కానీ ఇక నుంచి ఏ స్టెప్ వేయాలన్నా సజ్జలకు చెప్పమని భారతి చెప్పారు’..అంటూ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

    నాటి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రకటన వెనుక ఉన్న అంశాలను సునీత సీబీఐకి వివరించారు. ‘ఎవరో చేసిన పొరపాటుకు జగన్ నష్టపోకూడదని నాడు అనుకూల ప్రకటన చేశాను. నాడు వారి క్రిమినల్ మైండ్ తనకు అర్ధం కాలేదు.  ప్రెస్ మీట్ పెట్టాలని ఒత్తిడి చేసింది మాత్రం సజ్జల రామక్రిష్ణారెడ్డి. తొలుత నాన్నచనిపోయిన గదిలో రక్తం శుభ్రం చేశారని సీఐ శంకరయ్యపై ఫిర్యాదుచేస్తూ వీడియో ఒకటి సజ్జలకు పంపించాను. కానీ ఆయన నేరుగా ప్రెస్ మీట్ పెట్టమన్నారు. ఇంతటితో దీనికి ఫల్ స్టాప్ పెట్టాలని సూచించారు. జగన్, అవినాష్ రెడ్డిలకు అనుకూల ప్రకటన చేయమన్నారు. అవినాష్ రెడ్డి కుటుంబంతో దశాబ్దాల వైరం ఉండడంతో సంకొచించాను. కానీ ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నాను’ అంటూ సీబీఐకిచ్చిన వాంగ్మూలంలో కీలక సమాచారాన్ని ఇచ్చారు.

    ఈ కేసును టీడీపీ నేతలపై బలవంతంగా పెట్టే ప్రయత్నాలపై కూడా సునీత ప్రస్తావించారు. ‘వివేకా మృతదేహాన్ని పోస్టుమార్టం చేసే సమయంలో మర్చురి వద్ద ఉన్న తన వద్దకు ఫిర్యాదు కాపీని తీసుకొచ్చారు. టీడీపీ నాయకులు బీటెక్ రవి తదితరులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు రాసి ఉంది. వివేకా ప్రచారానికి వస్తారన్న భయంతో టీడీపీ నాయకులే ఈ ఘటనకు పాల్పడ్డారని అవినాష్ చెప్పారు. కానీ నేను దానిపై సంతకం చేయలేదు. 2019 జూలైలోనే అవినాష్ అండ్ కోపై అనుమానాలు పెరిగాయి. వివేకా మృతిచెందారని తమకు ముందే తెలుసునని గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఎవరితో చెప్పిన విషయం నాకు తెలిసింది. ఉదయ్ అవినాష్ రెడ్డి అనుచరుడు కావడంతో అనుమానం ప్రారంభమైంది. అటు భారతి, సజ్జల వాట్సాప్ స్క్రీన్ చాట్ లను సైతం సీబీఐకి అందించాను’ అంటూ..ఇలా సమగ్ర అంశాలతో కూడిన సునీత వాంగ్మూలం ఇప్పుడు బయటకు వచ్చింది.