Delay in Vijayawada Flood Relief : భారీ వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయి. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో దాదాపు విజయవాడ నగరం నీటి ముంపు బారిన పడింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీగా నష్టం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నియంత్రణకు చాలా చర్యలు చేపట్టారు. సుదీర్ఘ ప్రయత్నాలు తర్వాత విజయవాడ యధా స్థానానికి వచ్చింది. అయితే వరద బాధితులకు శరవేగంగా సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే నెల రోజులు దాటుతున్న ఇంతవరకు చాలామంది బాధితులకు పరిహారం దక్కలేదు. ప్రతి ఇంటికి వరద స్వయంగా 25 వేల రూపాయలు అందిస్తామని.. మొదటి అంతస్తులో ఉండే వారికి పది వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన బాధితులకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామందికి వరద సాయం అందింది. కానీ వివిధ కారణాలతో 22,185 మంది లబ్ధిదారులకు ఇంతవరకు సాయం అందలేదు.
* సాంకేతిక కారణాలతోనే
వరద సాయం విషయంలో ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. కానీ వివిధ సాంకేతిక కారణాలతో చాలామంది ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇటీవల చంద్రబాబుకు వరద సాయం పై విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమకు వరద సాయం అందలేదని బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వరద సమయంలో చురుగ్గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న ప్రభుత్వానికి.. ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. అందుకే చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల నాలుగు లోగా సాంకేతిక సమస్యలు పూర్తిచేసి ప్రతి బాధితుడి ఖాతాలో సాయం జమ చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చారు.
* ఆ అసంతృప్తి ఉండకూడదు
వరదల వల్ల నష్టపోయిన ఏ ఒక్కరిలో అసంతృప్తి ఉండకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎవరి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు జమకాలేదో.. వారు బ్యాంకుల కెళ్ళి కేవైసీని పరిశీలించుకోవాలని.. రెండు మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించి వారి ఖాతాకు నగదు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులు పరిహారం కోసం ఎటువంటి ఆందోళన పడవద్దని.. ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
* ఈసారైనా అందుతుందా?
అయితే వరదలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతుంది. సాధారణ పరిస్థితి నెలకొన్నా..బాధితుల్లో మాత్రం ఆ బాధ కనిపిస్తోంది. నష్టం జరగడంతో పేద వర్గాల్లో రోజువారి జీవనం కూడా కష్టంగా మారింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ సాయం అందకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలోనే చంద్రబాబు స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల నాలుగులోగా నగదు జమ అవుతుందని చెప్పుకొచ్చారు. మరి ఈసారైనా బాధితుల ఖాతాల్లో నగదు చేరుతుందా? లేదా? అన్నది చూడాలి.