YCP
YCP: వైసీపీని ఎమ్మెల్సీలు ఎందుకు వీడుతున్నారు? రెండు మూడేళ్ల పదవీ కాలాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? వైసిపి అధికారంలోకి రాదన్న భయమా? లేకుంటే ఆశించిన గౌరవం దక్కడం లేదా? అసలు వారు పార్టీని వీడడానికి కారణం ఏంటి? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్సీలు బయటకు వస్తున్నారు. టిడిపి, జనసేన లో చేరుతున్నారు. ముందుగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడారు. తాజాగా జంగా కృష్ణమూర్తి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు.మధ్యలో రామచంద్ర యాదవ్, ఇక్బాల్ వంటి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ రెండు మూడేళ్ల పదవీకాలం ఉంది. ఇంకా చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఒకవైపు అనర్హత వేటు పడుతున్నా వీరంతా పార్టీని వీడడం ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఎమ్మెల్యే టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు కేటాయిస్తామని హామీ ఇస్తారు. కానీ వైసీపీలో ఎమ్మెల్యే పదవి దక్కని ఎమ్మెల్సీలు పార్టీని వీడడం ఆశ్చర్యపరుస్తోంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో 50 మంది వరకు నాయకులు టిక్కెట్లు కోల్పోయారు. అటువంటి వారికి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, రాజ్యసభ తో పాటు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకత్వం హామీ ఇస్తోంది. దీంతో చాలామంది మెత్తబడుతున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వైసీపీలో అందుకు భిన్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదని ఏకంగా ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పి.. ప్రత్యర్థి పార్టీల్లో చేరుతున్నారు.
వైసీపీలో ఎమ్మెల్సీ పదవి అంటే నామినేటెడ్ పోస్ట్ కంటే చాలా హీనంగా చూస్తున్నారు. వారు సొంత నియోజకవర్గాల్లో వాలంటీరుకు తక్కువన్న రేంజ్ లో ఉన్నారు. చివరకు తమ సొంత గ్రామాల్లో సైతం.. అనుకున్న పనులు సాధించలేకపోతున్నారు. ఎమ్మెల్సీ అంటే పదవి తప్ప.. ఎటువంటి అధికారాలు ఉండడం లేదు. పైగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే.. నియోజకవర్గాల్లో జోక్యం ఉండకూడదు అన్న ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఏకపక్షంగా వైసీపీ ఎమ్మెల్సీలు సాధించింది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోట కింద దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. ఇవి చాలా ఉన్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసి వైసిపి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం ఆ పార్టీలో ఎమ్మెల్సీలు కేవలం ఉత్సవ విగ్రహాలే. అందుకే ఎక్కువమంది ఆ పార్టీలో కొనసాగడానికి ఇబ్బంది పడుతున్నారు. భే షరతుగా ప్రత్యర్థి పార్టీల్లో చేరుతున్నారు. ఇది అధికార పార్టీ శ్రేణుల్లో మింగుడు పడడం లేదు.