YS Sharmila: ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ ఇచ్చిన టాస్క్ ఏమిటి? ఆమె చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకుంటారని అందరికీ తెలుసు. కానీ ఆమె పిసిసి పగ్గాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకుండా పోయింది. కేవలం వైసీపీ తో పాటు జగన్ పై వ్యక్తిగత విమర్శలకే ఆమె పరిమితం అవుతున్నారు. అయితే జగన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు కాంగ్రెస్ ను ఒక వేదికగా ఎంచుకున్నారని.. దానివల్ల కాంగ్రెస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
అన్నను విభేదించి తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేశారు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ అన్న పెద్దగా ఓదార్పు ఇవ్వలేదు. దీంతో వారి మధ్య పెద్ద అగాధం ఉందని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ చేరదీసింది. ఆమె పార్టీని తనలో విలీనం చేసుకుంది. ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే… సోదరుడిని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలవలేదు. ఆ విషయం షర్మిలకు సైతం తెలుసు. కానీ అన్నను దెబ్బతీసేందుకు ఒక సరైన వేదిక అవసరం. అందుకు కాంగ్రెస్ పార్టీ సరైనదని ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ వేదికగానే తన సోదరుడు జగన్ దెబ్బతీయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.
2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికి కోల్పోయింది. గత రెండు ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. దానిని ఎలా అధిగమించాలన్నది షర్మిల చేయాల్సిన ప్రయత్నం. విభజనతో కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టం ఒప్పుకొని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామని షర్మిల ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఆమె ఆ పని చేయకుండా వైసిపి వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైసీపీ నేతల అవినీతిని ప్రస్తావిస్తున్నారు. జగన్ ఏ విధంగా ప్రజలను వంచించింది వివరిస్తున్నారు. అయితే ఇలా చేసే క్రమంలో ఆమె వైసీపీని దెబ్బతీస్తున్నారు సరే.. దాని ద్వారా కాంగ్రెస్ కు వచ్చే లబ్ధి ఏమిటో తెలియడం లేదు.
తెలంగాణలో ఇదే మాదిరిగా రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అటువంటి ప్రయత్నం ఏపీలో షర్మిల చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి లోటు. వైసీపీలో జగన్ ను విభేదించే ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. అది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, సంక్షేమ పథకాలు, సుపరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. విభజనతో ఏర్పడిన కష్టాలను, ప్రజల కన్నీళ్లను కాంగ్రెస్ పార్టీ తుడుస్తుందని భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇవేవీ చేయకుండా సోదరుడు జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూడడం ఏమంత శ్రేయస్కరం కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్ లో చేరింది, పీసీసీ పగ్గాలు తీసుకుంది జగన్ పతనం కోసమేనని షర్మిల భావిస్తే.. దానికి ఎవరూ ఏం చేయలేరు.