Komatireddy Rajagopal Reddy Ministerial Post: ఇటీవల తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉంటున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు.. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరిపోయారు. కాంగ్రెస్లో చేరుతున్నప్పుడే ఆయనకు పార్టీ పెద్దలు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చారట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తొలి దఫాలో మంత్రి పదవి లభించింది. అయితే అప్పుడు తనకు మంత్రి పదవి లభించకపోవడం పట్ల రాజగోపాల్ రెడ్డి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానంపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
ఇటీవల రెండవ విడత మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆయన కాకుండా వేరే వారికి మంత్రి పదవులు లభించాయి. దీంతో అప్పట్లోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఆ నిర్ణయం తీసుకోలేదు. పైగా పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక అప్పటినుంచి ఆయన అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధిష్టానం పై ఏదో ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంపై మండిపడుతూనే ఉన్నారు.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “పది సంవత్సరాల ముఖ్యమంత్రి, సోషల్ మీడియా జర్నలిస్టుల” వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలకు సహజంగానే భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా తెగ ప్రచారం కల్పించింది. రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఇలా ఉంటే.. ఆయన సోదరుడు వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా పరిపాలన సాగించాలని ఇటీవల విఘ్నేశ్వరుడికి పూజలు కూడా నిర్వహించారు.. ఇది ఇలా ఉండగానే ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గురించి చర్చ వచ్చింది. దానిపై విక్రమార్క తనదైన శైలిలో స్పందించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పింది వాస్తవమేనని.. కాకపోతే దానికి కొన్ని సమీకరణాలు అడ్డుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఆ పేపర్ కటింగ్ ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నది ఎవరో చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన విషయాన్ని తెలంగాణ సమాజానికి అర్థమయ్యేలా చెప్పిన భట్టి విక్రమార్క కు రాజగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పరోక్షంగా విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది కూడా ఆయనే అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమ… pic.twitter.com/pxaw9SgYMn
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 11, 2025