Homeఆంధ్రప్రదేశ్‌AP Reservoirs: చంద్రబాబు దశ, ఆంధ్రా దిశ రెండూ మారనున్నాయా?

AP Reservoirs: చంద్రబాబు దశ, ఆంధ్రా దిశ రెండూ మారనున్నాయా?

AP Reservoirs: “చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు కురువవు. జలాశయాల్లో నీళ్లు ఉండవు. పంటలు పండవు. అంతిమంగా రైతులకు వలసలు తప్పవు.. చంద్రబాబు అంటే వరుణ దేవుడికి కూడా కోపమే”.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసిపి చేసిన ఆరోపణలు ఇవి. అయితే ఈసారి వైసీపీ ఆరోపణలు ఎదురు తంతున్నాయి. ఎందుకంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అవి ఏపీ దశను, దిశను మార్చే విధంగా ఉన్నాయి.

Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!

గడచిన రెండు దశాబ్దాల కాలంతో పోల్చి చూస్తే.. ఈసారి ఏపీలో జలాశయాలు నిండుగా వాన నీటితో కళ కళ లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం.. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల జలాశయాలు నీటి నిల్వలతో తొణికి సలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 110 జలాశయాలు ఉన్నాయి. వీటన్నిటిలో ప్రస్తుతం 760.03 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన ఏడాది ఆగస్టు 10 నాటికి ఏపీ రాష్ట్రంలో 668 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గడచిన ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 92 టీఎంసీల నీరు అధికంగా నిలువ ఉంది.. ఈ నెలాఖరు నాటికి జలాశయాలు పూర్తిగా నిండుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు ప్రారంభం నాటికి ఈ స్థాయిలో జలాశయాలు నీటినిల్వ సాధించడం గొప్ప విషయంగా అధికారులు పేర్కొంటున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలాశయాలు ఈ స్థాయిలో నీటి నిల్వలను సొంతం చేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉండడం..రుతుపవనాలు చురుకుగా కదులుతూ ఉండడంతో ఈ నెలలో మరింత విస్తారంగా వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ కంటే ముందుగానే జలాశయాలు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యాన్ని చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ వల్ల వ్యవసాయ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని.. తాగునీటి అవసరాలు కూడా తీరుతున్నాయని అధికారులు వివరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ పులిచింతల వంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నీటిమట్టాన్ని సాధించాయని అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 590 అడుగుల నీరు నిల్వ ఉందని.. ఇది 312.05 టీఎంసీలకు సమానమని అధికారులు అంటున్నారు. శ్రీశైలంలో 215.80 టీఎంసీలకు గాను 189.45 టీఎంసీల నీటి నిల్వని కలిగి ఉంది. ప్రాజెక్టు ఎకో ప్రాంతాల నుంచి 1,97,188 క్యూసెక్కుల నీరు వస్తున్నది. పులిచింతల ప్రాజెక్టు లో కూడా 42. 72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు 49,521 క్యూసెక్కుల నీరు వస్తోంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కూడా 2.93 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది.

మధ్యస్థ, చిన్న జలాశయాలు కూడా వాటి సామర్థ్యంతో పోల్చి చూస్తే 51.2 శాతం వరకు నీటి నిలువ సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాయి. మధ్యస్థ, చిన్న తరహా జలశాల మొత్తం సామర్థ్యం 137.08 టీఎంసీలు. అయితే ఇప్పటివరకు అవి 70.21 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రధాన జలాశయాలలో నీరు పుష్కలంగా ఉండడంతో కృష్ణ డెల్టా లోని రైతులు రబీ సీజన్లోనూ వరి సాగు చేస్తామని చెబుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నీటి లభ్యత లేకపోవడంతో రబీ సీజన్లో రైతులకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేయడం లేదు. అయితే ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రబీ లో వరి సాగుకు జలాలను విడుదల చేస్తుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు..

ఈసారి మెండుగా వర్షాలు కురవడం.. ఊహించిన స్థాయిలో వరద నీరు వస్తున్న నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెండుగా పంటలు పండించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఆయనపై వ్యతిరేక ప్రచారం చేసేవి. ఆయన అధికారంలోకి వస్తే కరువు వస్తుందని విమర్శించేవి. అయితే ఈసారి అందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా చంద్రబాబుపై వరుణుడు అనుగ్రహం చూపిస్తున్నాడని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular