Pawan Kalyan: రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నేరుగా కాకినాడ పోర్టుకు వెళ్లి సౌత్ ఆఫ్రికా కు షిప్ లో తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. డీఎస్ఓ, కలెక్టర్, ఎస్పీ, డిఎస్పి, పోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చుకోకపోవడంపై విరుచుకుపడ్డారు. బియ్యం మాఫియా కు ఇప్పటికీ కూడా సహకారం అందిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ అక్రమ రవాణా విషయంలో పదేపదే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయని.. పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇప్పుడు ఆ పేర్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ పేర్లు పై బలమైన చర్చ నడుస్తోంది.
* ఆ ఇద్దరు ఎవరు
డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల్లో ఎక్కువగా అలీషా, అగర్వాల్ అనే వ్యక్తుల పేర్లు వినిపించాయి. మానసా అనే సంస్థ గురించి పవన్ ఎక్కువగా ప్రస్తావించారు. దీంతో వీరు ఎవరు? ఆ సంస్థ ఎవరిది? అనేది హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆ ఇద్దరూ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితులని తెలుస్తోంది. మరో వ్యక్తి ఆయనకు సోదరుడని సమాచారం. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో వినోద్ అగర్వాల్ కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. ఓడల తయారీ ద్వారా పోర్టులో కీలకంగా మారిన షేక్ అహ్మద్ అలీషా మానసా సంస్థ యజమాని. వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్ర రెడ్డి కీలక సూత్రధారులు ఒకరని విశ్వసనీయ సమాచారం. వీరి అండదండలతోనే గత ఐదేళ్లుగా పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
* అప్పట్లోనే ఆరోపణలు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ద్వారంపూడి పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పవన్ సైతం తన పర్యటనల్లో ప్రత్యేకంగా దీనినే ప్రస్తావించేవారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. ఇప్పటికీ కాకినాడ పోర్టులో ద్వారంపూడి హవా నడుస్తుందని గుర్తించారు. అందుకే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ రాకెట్ కు అగర్వాల్ ప్రధాన వ్యక్తిగా తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ పదేపదే ఆ పేరు ప్రస్తావించినట్లు సమాచారం. మొత్తానికైతే గత ఐదేళ్లుగా నడుస్తున్న బియ్యం దందాను బయటకు తీయడంలో పవన్ కొంత వరకు సక్సెస్ అయ్యారు.