TTD Trust Board : కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బీర్ నాయుడును నియమించింది. సభ్యులుగా మరో 24 మంది నియమితులయ్యారు. ఈ తరుణంలో టీటీడీ అనుబంధ విభాగాలకు సంబంధించి ఎంపికలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పదవులను సొంతం చేసుకునేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. టీటీడీ అనుబంధ విభాగాలుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండు విభాగాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకమైన పదవులు గా ఉన్నాయి. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.అలాగే ఎస్వీబీసీ సీఈవో, అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్ పదవుల భర్తీ కోసం కూడా ముమ్మర కసరత్తు జరుగుతోంది.
* తొలిసారిగా రాఘవేంద్రరావుకి పదవి
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు మంచి పేరు ఉంది. 2018 ఏప్రిల్ 21న తొలిసారిగా సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. చానల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కష్టపడ్డారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. జగన్ సర్కార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి ఆ పదవి ఇచ్చింది. అయితే అనేక వివాదాలు చుట్టుముట్టడంతో పృథ్వితో రాజీనామా చేయించింది జగన్ సర్కార్. అటు తర్వాత వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఆయన కొనసాగారు. ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
* అకాడమీలో ఉద్యోగులకు, అర్చకులకు శిక్షణ
టీటీడీకి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ నడుస్తోంది. టీటీడీ ఉద్యోగులతో పాటు అర్చకులకు ఇక్కడ శిక్షణ ఇస్తుంటారు. గత ఐదేళ్లుగా చైర్మన్ గా సుబ్రమణ్యం రెడ్డి ఉండేవారు. ఈయన భూమన కరుణాకర్ రెడ్డి కి స్వయానా సోదరుడు. అధ్యాపకుడిగా ఉంటూ రిటైర్ అయ్యారు.టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో పదవికి రాజీనామా చేశారు. ఈ పదవికి సైతం విపరీతమైన డిమాండ్ ఉంది. టిడిపి,జనసేన, బిజెపి నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.