Rajya Sabha by-election : రాజ్యసభ పదవుల విషయంలో సమీకరణలు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ సభ్యులుగా ఉన్న బీద మస్తాన్ రావు,మోపిదేవి వెంకటరమణ,ఆర్ కృష్ణయ్యలు పదవులకు రాజీనామా చేశారు. మస్తాన్ రావు తోపాటు మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరారు. కృష్ణయ్య బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ మూడు పదవుల భర్తీకి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.అయితే రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు ఉండడంతో చెరో సీటు తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. అయితే టిడిపికి రెండు ఎంపీ సీట్లు ఖాయమైనట్లు ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు మెగా బ్రదర్ నాగబాబుకు సైతం ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఢిల్లీ పెద్దల సిఫార్సులతో మొత్తం సీన్ మారినట్లు సమాచారం.
* ఒక స్థానం బీసీలకు
ఇప్పుడు ఖాళీ అయిన మూడు స్థానాలు బీసీలకు చెందిన. రాజీనామా చేసిన ముగ్గురు బీసీ నేతలే. అందుకే ఒక పదవి బీసీలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మస్తాన్ రావు పదవీకాలం మరో నాలుగు ఏళ్ల పాటు ఉంది. రాజ్యసభ రెన్యువల్ చేస్తామంటేనే రాజీనామాకు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. పైగా పూర్వాశ్రమంలో ఆయన టిడిపి నేత. అందుకే ఆయనకు రాజ్యసభ పదవిని చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సీట్లలో జనసేనకు ఒకటి కేటాయిస్తారని సమాచారం.
* గల్లా జయదేవ్ కు ఛాన్స్
మరోవైపు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు పదవి ఇవ్వాలని చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు జయదేవ్. ఈ ఎన్నికలకు ముందు ఆయన అనుహ్యంగా రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే జయదేవ్ ట్రాక్ రికార్డు చూసి పదవి ఇవ్వాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే టిడిపికి రెండు ఎంపీ సీట్లు అన్నమాట.
* తెరపైకి సానా సతీష్
ఇక మెగా బ్రదర్ నాగబాబుకు సైతం రాజ్యసభ పదవీ ఖాయమన్న ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా సానా సతీష్ పేరు తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాగబాబుకు వెనక్కి రప్పించినట్లు సమాచారం. త్వరలో భర్తీ చేసే రాజ్యసభ పదవుల్లో నాగబాబుకు ఢిల్లీకి పంపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. సరిగ్గా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే సమయంలో నాగబాబు రాజ్యసభకు ఎంపిక అయితే మార్గం సుగమం అవుతుందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా జనసేన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కలుగుతుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* ఆ కేంద్రమంత్రికి
ఇంకోవైపు బిజెపి అగ్రనేతలు ఒక రాజ్యసభ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఓ కేంద్ర మంత్రిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలని బిజెపి పెద్దలు కోరారట. దీనిపై చంద్రబాబుతో పాటు పవన్ తర్జన భర్జన పడుతున్నారు. తప్పకుండా బిజెపి పెద్దల ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. అదే జరిగితే టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు, జనసేన నుంచి సానా సతీష్, బిజెపి నుంచి ఒక కేంద్రమంత్రి రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు అన్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.