AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి సంచలనాలకు తెరతీసింది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. త్వరలో బిజెపి సైతం చేరుతుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు విపక్షాలన్నీ జగన్ ను గద్దె దించాలని చూస్తున్నాయి.అయితే ఏపీకి నాయకత్వ పరంగా మాత్రం ఈసారి పవన్ తోడయ్యారు.ఇప్పటికే సీఎం జగన్ తో పాటు చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఏపీ ప్రజలు ఎవరికీ జై కొడతారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. జగన్ తో పాటు చంద్రబాబు సీఎం కావాలని భావిస్తున్నారు. ప్రజా మద్దతు ఉంటే తాను కూడా సీఎం అవుతానని పవన్ చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎవరు సీఎం అవుతారు? అనే అంశాలపై బలమైన చర్చ నడుస్తోంది.
మరోసారి గెలిచి సత్తా చాటాలని జగన్ బలమైన ఆకాంక్షతో ఉన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశాము కాబట్టి.. ప్రజలు అనుకూలంగా తీర్పు ఇస్తారని ఆశాభావంతో ఉన్నారు. మొన్నటివరకు వై నాట్ 175 అని సౌండ్ చేసినా.. ఇప్పుడు మాత్రం గెలిస్తే చాలు అన్న రేంజ్ కు వచ్చారు.కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు వేస్తే చాలు అని జగన్ భావిస్తున్నారు. కానీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం బాహటంగానే జగన్ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సానుకూలత కనిపిస్తోంది.అయితే మౌలిక వసతులు,అభివృద్ధి లేకపోవడం మైనస్ గా మారింది.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. కానీ వీటన్నింటినీ సంక్షేమ పథకాలు అధిగమిస్తాయని జగన్ కొండంత ఆశతో ఉన్నారు.
ఈసారి అధికారంలోకి వచ్చి ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోకూడదని భావిస్తున్నారు. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల హామీలను విస్మరించారు. చాలా విషయాల్లో మాట తప్పారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొన్ని వర్గాలు చంద్రబాబును నమ్మడం లేదు. ఇందులో జగన్ బాధ్యత వర్గాలు సైతం ఉండడం విశేషం. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడం, జనసేనతో పొత్తులో ఉండడం టిడిపికి కలిసి వచ్చే అంశం.అయితే పొత్తులో భాగంగా పెద్ద ఎత్తున సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో చాలామంది నాయకులు అభద్రతాభావంతో ఉన్నారు. ఇది పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది.
అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో గ్రాఫ్ పెంచుకున్నారు. చంద్రబాబు, జగన్ ల సరసన ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబడ్డారు. ఇంతవరకు విజయం దక్కకపోయినా ప్రజల కోసం పోరాడుతుండడాన్ని గుర్తింపు లభిస్తోంది. ప్రజలు కూడా పవన్ ను గుర్తించడం ప్రారంభించారు. పవన్ కు క్లీన్ ఇమేజ్ ఉండడం కలిసొచ్చే అంశం. మరోవైపు తన బలాన్ని అంచనా వేసుకుని అడుగులు వేస్తుండడం సైతం ప్లస్ గా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయకపోవడం, బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం మైనస్ గా మారింది. క్షేత్రస్థాయిలో జనసైనికులు ఉన్నా.. ఓటర్లను పోలింగ్ బూత్ కు తెప్పించేవారు లేకపోవడం కూడా మైనస్ గా మారింది. అయితే ప్రభుత్వ బాధిత వర్గాలు అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత మాత్రం పవన్ పై నమ్మకం పెట్టుకున్నారు. పవన్ సీఎం అయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికైతే ఏపీలో నాయకత్వం విషయంలో త్రిముఖ పోటీ నెలకొంది.