YS Jagan : ఎక్కడైనా యాగాలు చేస్తే జనాలు తండోపతండాలుగా రావడం చూస్తుంటాం. స్వచ్ఛందంగా వచ్చి భాగస్థులవుతుంటారు. అయితే రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ఏపీ సర్కారు చేస్తున్న యాగానికి మాత్రం జనాలు ముఖం చాటేస్తున్నారు. చివరకు బస్సులు వేస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. రాష్ట్రం కోసం యాగమని చెబుతున్నా.. అది జగన్ సర్కారు కోసమేనని అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు చెందిన రూ.10 కోట్ల నగదును పోగుచేసి మరీ యాగం చేస్తున్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలని నిర్వహిస్తున్న యాగమని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం.
అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమంగా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ తరహా యాగాలు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తుంటారు. జనం కూడా తండోపతండాలుగా వస్తుంటారు. యాగం చేసే వ్యక్తులు, వారి చేసే పనులు, పవిత్రత బట్టి కూడా జనం మొగ్గు చూపుతుంటారు. కేసీఆర్ ఈ విషయంలో ముందంజలో ఉంటారు. పైగా యాగాలు ప్రభుత్వపరంగా ఎప్పుడూ చేయరు. కేవలం తన వ్యక్తిగత ఖర్చుతో యాగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో చేస్తున్న యాగానికి ప్రభుత్వ ముద్ర వేశారు. పైగా సీఎం జగన్ అన్య మతస్థుడు. బహుశా ఈ లెక్కతోనే చాలామంది భక్తులు యాగానికి దూరంగా ఉంటున్నారు.
జనాలు యాగానికి రాకపోవడంతో జగన్ సర్కారు కాస్తా చిన్నబోతోంది. సాధారణ సభలు, సమావేశాల మాదిరిగా జన తరలింపునకు టార్గెట్లు ఇస్తోంది. చివరి రోజు పుర్ణాహుతి కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరవుతున్నారు. ఆ రోజు హాజరు శాతం తక్కువగా ఉంటే సీఎం అసహనం వ్యక్తం చేసే అవకాశముంది. అందుకే విజయవాడ నలుమూలల నుంచి జనాలను యాగశాల వైపు తరలించే ఏర్పాట్లు చేస్తున్కనారు. సచివాలయాలకు, వలంటీర్లకు, చోటా నాయకులకు టార్గెట్లు ఇస్తున్నారు. పలానా సంఖ్యలో జనాలను తరలించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు.
అయితే ఎప్పుడు సీఎం జగన్ యాగాలు చేసినా శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామిజీని ఆశ్రయించేవారు. కానీ ఈసారిఆయన్ను తప్పించారు. దీంతో అస్ధాన స్వామిజీ కాస్తా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. తన ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించడం లేదు…పైగా తన మాటలను కూడా పట్టించుకోవడం లేదని..సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఫీలవుతున్నారు. అందుకే దేవాదాయశాఖపై ఆయన కాస్తా ఆగ్రహంగానే ఉన్నారు. ఏకంగా కొంతమంది అధికారులపై వేటు వేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారుట. దీంతో ఇది పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది.