https://oktelugu.com/

Somu Veerraju : ఏపీ బీజేపీని షేక్ చేస్తున్న సోము వీర్రాజు షోకాజ్ లు

ఇటువంటి సమయంలో సోము వీర్రాజు ఓర్పు, నేర్పుతో వ్యవహరించాలి. కానీ తొందరపాటు చర్యలకు దిగుతున్నారు. అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలానే చేస్తే మాత్రం ప్రత్యర్థివర్గం ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం పక్కా. 

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2023 / 05:21 PM IST
    Follow us on

    Somu Veerraju : ఏపీలో బీజేపీ బలం సామాన్యుడికి కూడా తెలుసు. అయినా ఏదో కేంద్రంలో అధికారంలో ఉంది కదా అని అమాత్రం నేతల తాకిడి ఉంది. లేకుంటే అదీ కూడా ఉండదు. అవసరాలకు వచ్చిన నాయకులు కొందరు. పార్టీ అండదండల కోసం మరికొందరు. ఇలా వలస పక్షులతో కిటకిటలాడుతున్న బీజేపీకి జనాదరణ తగ్గడానికి వారే కారణం. ఆపై ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపసీలు తెగ ఆడేసుకుంటున్నాయి. దీంతో ఎదగాలని ప్రయత్నిస్తున్నా కమలం మాత్రం విచ్చుకోవడం లేదు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం లేదు. అయితే ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా షోకాజ్ నోటీసులు ఆ పార్టీలో కాకరేపుతున్నాయి.

    పార్టీ గీత దాటిన వారికి ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారమైనా.. షోకాజ్ అందిస్తున్న వరకూ ఓకే కానీ.. తదుపరి చర్యలంటూ ఏవీ కానరాకపోవడంతో నవ్వులపాలవుతున్నారు. పైగా షోకాజ్ నోటీసులపై రకరకాల విశ్లేషణలు. కేవలం టీడీపీకి అనుకూలమైన నాయకులకే ఇస్తున్నారు తప్ప… వైసీపీకి ఫేవర్ గా ఉన్న బీజేపీ నాయకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్న వారు ఎక్కువవుతున్నారు.షోకాజ్ నోటీసులు ఫలితం ఇవ్వకపోగా.. తిరిగి చేటు తెస్తున్నాయని సగటు బీజేపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    అయితే ఇప్పడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కార్నర్ చేస్తూ పార్టీలో ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. నవ్వులపాలు చేయాలని చూస్తున్నారు. అటువంటి ఘటనే ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారాన్ని బేస్ చేసుకొని పార్టీ నేత విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ ఇవ్వడంపై విమర్శలకు దారితీస్తోంది. గత ఎన్నికలకు ముందు విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను ప్రోమోగా చేసి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు ఎడిట్ చేశారు. ఆ ప్రోమోయే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానిని పట్టుకొని షోకాజ్ నోట్ జారీచేశారు. కానీ తదుపరి పరిణామాలు ఏవీ తెలియడం లేదు. అయితే ఈ విషయంలో సోము వీర్రాజుకు ఏ స్థాయిలో డ్యామేజ్ జరగాలో అంతలా జరిగిపోయింది.

    వాస్తవానికి ఏపీ బీజేపీలో వర్గాలు అధికం. అందునా రాష్ట్ర పగ్గాలు సోము వీర్రాజు నుంచి ఎప్పుడు తీసుకుందామా అని ఓ వర్గం కాచుకొని కూర్చొంది. బీజేపీని టీడీపీకి దగ్గర చేయాలన్నదే ఆ వర్గం ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకు వీర్రాజు అడ్డంకిగా నిలుస్తున్నారన్నది ఆ వర్గం అనుమానం. అందుకు వారు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ వారి పాచికలు పారడం లేదు. ఇటువంటి సమయంలో సోము వీర్రాజు ఓర్పు, నేర్పుతో వ్యవహరించాలి. కానీ తొందరపాటు చర్యలకు దిగుతున్నారు. అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలానే చేస్తే మాత్రం ప్రత్యర్థివర్గం ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం పక్కా.