YCP Leaders : వారి మౌనం.. వైసీపీకి శాపం.. ఆ నలుగురి ప్రయాణం ఎటు?

వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ఉన్నారు. వారంతా పార్టీ పరాజయం కావడంతో సైలెంట్ అయ్యారు. పార్టీ అధినేత తీరుపై కీనుక వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Written By: Dharma, Updated On : October 22, 2024 12:29 pm

YCP Leaders

Follow us on

YCP Leaders :  గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఎన్నికల్లో భారీ ఓటమితో ఆ పార్టీ కుదేలయ్యింది. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు దూరమవుతున్నారు. ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. అటు సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారు. చాలామంది పార్టీ కార్యకలాపాలు కనీస స్థాయిలో కూడా పాల్గొనడం లేదు. అసలు వారు పార్టీలో ఉన్నారా? లేదా? అన్నా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నేతలంతా మూకుమ్మడిగా పార్టీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, కృష్ణయ్యలు రాజీనామా చేశారు. పార్టీకి దూరమయ్యారు. మరో నలుగురు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. పదవులు వదులుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నారు. అయితే ఇలా పార్టీని వీడుతున్న వారితో ఎటువంటి నష్టం లేదు. కానీ పార్టీలో ఉంటూ సైలెంట్ గా ఉన్నారు నలుగురు సీనియర్ నాయకులు. ఇప్పుడు వారి వైఖరి పైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. అసలు వారు పార్టీలో ఉంటారా? ఉండరా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

1. ధర్మాన ప్రసాదరావు : ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడు.వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. 1989లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టారు. 2004 నుంచి రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా మెలిగారు. కానీ ఆయన అకాల మరణంతో పరిస్థితి మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరాల్సి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ధర్మాన దూరమయ్యారు. పార్టీ కార్యకలాపాలకు సైతం హాజరు కావడం లేదు. దీంతో అసలు ఈయన పార్టీలో ఉంటారా? లేదా? అనేది అవమానమే.

2. ముద్రగడ పద్మనాభం: రాజకీయ నాయకుడి కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే సుపరిచితులు ముద్రగడ పద్మనాభం.ఎన్నో రకాల పదవులు చేపట్టారు ఆయన.టిడిపి,కాంగ్రెస్లో పని చేశారు. 2014లో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆ పార్టీలో చేరలేదు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని భావించారు. పవన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో పవన్ ను ఓడించేందుకు ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు.వైసిపి ఓడిపోవడంతో ఆ పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు ముద్రగడ.

3. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు: వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఒకరు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా ఉన్న ఆయన జగన్ పిలుపుతో ఆ పార్టీలో చేరారు. అయితే ఆయన సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు. ఈ ఎన్నికల్లో బలవంతంగానే ఆయన అల్లుడు గుంటూరు నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఓటమి ఎదురైంది. అయితే శాసనమండలిలో విపక్ష నేత పాత్ర పోషించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉంది.కానీ జగన్ ఆ పదవి ఇవ్వలేదు. అప్పటినుంచి వైసీపీ కార్యక్రమాల ముఖం చూడడం మానేశారు.

4. గడికోట శ్రీకాంత్ రెడ్డి :కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి వైయస్ కుటుంబానికి ఆత్మీయ నేత. ఎన్నికల్లో రాయచోటి నుంచి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. చీఫ్ విప్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి తొలగించారు. దీంతో రాజకీయాలపైనే ఆయన ఎక్కువగా మొగ్గు చూపలేదు. జగన్ వైఖరి నచ్చక రాజకీయాల నుంచి బయటకు వెళ్లిపోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి వైసిపి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే ఈ నలుగురు నేతల వైఖరి తెలియక వైసీపీ హై కమాండ్ సతమతమవుతోంది.