Nara Lokesh : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఎవరి పాత్రలో వారు పరకాయ ప్రవేశం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా ఉన్నారు. క్యాబినెట్లో మిగతా మంత్రులు ఉన్నా.. పవన్ తో పాటు లోకేష్ కు చెప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే వారిని కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నేరుగా లోకేష్ ను ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఐఐటి, నీట్ ప్రవేశాల విషయంలో కొంతమంది దివ్యాంగ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో ఒకరు లోకేష్ కు వాట్సాప్ ద్వారా ఆశ్రయించారు. అరగంట వ్యవధి లోనే స్పందించిన లోకేష్ వారి సమస్యను పరిష్కరించ గలిగారు. అయితే ఈ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది సమస్యలకు పరిష్కార మార్గం చూపించగలుగుతున్నారు. దీంతో ఆయన వాట్సాప్ ఖాతా స్తంభించింది.
అయితే లోకేష్ వాట్సాప్ ఖాతా బ్లాక్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తన వాట్సాప్ ఖాతా బ్లాక్ కావడం వెనుక ఉన్న కారణాలను వెల్లడించడంతో పాటు ప్రత్యామ్నాయంగా తనను ఎలా సంప్రదించాలో చెప్పారు లోకేష్. ఎక్స్ పోస్టులో వివరించే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి వరదల వచ్చిన మెసేజ్ లతో సాంకేతిక సమస్య తలెత్తి.. తన వాట్సాప్ ఖాతాను ‘మెటా’బ్లాక్ చేసిన విషయాన్ని వెల్లడించారు.ఎవరైనా సమస్యలు చెప్పాలనుకుంటే వాట్సాప్ చేయవద్దని విన్నవించారు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా.. ఇకనుంచి పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in కు పంపించాలన్నారు. పాదయాత్రలో యువతకు తనను దగ్గర చేసింది హల్లో లోకేష్ కార్యక్రమమేనని.. అప్పట్లోనే ఈ మెయిల్ ప్రత్యేకంగా క్రియేట్ చేసినట్లు చెప్పుకొచ్చారు లోకేష్. తనను సంప్రదించాలనుకునేవారు తమ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య, సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులతో పొందుపరిచి మెయిల్ చేయాలని లోకేష్ సూచించారు. మీకు సహాయం చేయడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ నుంచి 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు లోకేష్. రాష్ట్రంలో రెండో అతిపెద్ద మెజారిటీ. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టిడిపి ఆవిర్భావం తర్వాత మంగళగిరిలో ఆ పార్టీ గెలిచింది రెండుసార్లు మాత్రమే. అటువంటి క్లిష్టమైన నియోజకవర్గాన్ని ఎంచుకున్న లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి ప్రజలతో మమేకమై పనిచేశారు. ఈసారి కూడా లోకేష్ ను ఓడించాలని జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నియోజకవర్గ ప్రజలు ఏకపక్షంగా లోకేష్ కు మద్దతు తెలిపారు. అందుకే వారి రుణం తీర్చుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఏ సమస్యపై వచ్చినా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూడా లోకేష్ ను ఆశ్రయించడం ప్రారంభించారు. అందుకే ఆయన వాట్సాప్ సాంకేతిక సమస్యలతో బ్లాక్ అయ్యింది. ఇదే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో లోకేష్ స్పందించారు. ప్రత్యామ్నాయంగా తన ఈమెయిల్ ఐడి ని రాష్ట్ర ప్రజలకు షేర్ చేశారు.