Chandrababu Naidu: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడే చంద్రబాబు సర్కార్ పాలనకు నెల రోజులు ముగిసింది. ఇంకా 59 నెలల వ్యవధి ఉంది. అయితే తన ప్రాధాన్యత అంశాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. బాధ్యతలు తీసుకున్నాక పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అమరావతి రాజధానిని పరిశీలించారు. ఇప్పుడు తన ముందున్న ఏకైక కర్తవ్యం అమరావతి అని తేల్చి చెప్పారు. అమరావతికి కీలక ప్రాజెక్టులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మొన్న మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి కేంద్రం నుంచి నిధులు సాధించేలా గట్టిగానే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2014 మాదిరిగానే.. తన పాలనలో సింహభాగం అమరావతి రాజధానికి కేటాయిస్తానని సంకేతాలు పంపారు.
* ప్రపంచానికి తలమానికంగా అమరావతి..
ప్రపంచానికి తలమానికంగా అమరావతి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు. కానీ ఆయన ప్రయత్నం చేస్తుండగానే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేవలం చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని అమరావతిని నిర్వీర్యం చేసింది. గత ఐదేళ్లుగా అమరావతి అప్పటి మంత్రులు చెప్పిన మాదిరిగానే స్మశానంలా మారింది. అందుకే అమరావతి పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు. ఇలా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిక్షణం అమరావతి కోసమే ఆలోచన చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదుకు తలదన్నేలా రాజధాని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి పరిస్థితులు సైతం కలిసి వస్తున్నాయి. బయటకు గడువు చెప్పకపోయినా.. అమరావతికి కొద్ది రోజుల్లో ఒకరూపం తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
* నవ నగరాల నిర్మాణమే లక్ష్యం..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ సంస్థలకు పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేశారు. రైతుల త్యాగాలకు ఫలంగా రిఫండబుల్ ప్లాట్లు కూడా కేటాయించారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో.. అమరావతి చిట్టడవిలా మారిపోయింది. కేవలం అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులకే దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఒక వైపు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి పూర్వస్థితికి తీసుకొచ్చిన తర్వాత.. ఆ సంస్థలకు తిరిగి భూములు కేటాయించాలని చంద్రబాబు గట్టి ప్రయత్నం లోనే ఉన్నారు. ఐకానిక్ నిర్మాణాలకు సంబంధించి పునాదులు పూర్తయిన వాటి స్థితిగతులు తెలుసుకునేందుకు సిఆర్డిఏ అధికారులు రంగంలోకి దిగారు. ఇంజనీరింగ్ అధికారుల బృందంతో వాటి నాణ్యత, ప్రస్తుత స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించి నివేదిక వచ్చిన వెంటనే తదుపరి కార్యాచరణ ప్రారంభించనున్నారు.
* క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు..
మరోవైపు దేశ, విదేశ దిగ్గజ సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయి. చంద్రబాబును పలువురు విదేశీ కంపెనీల బృందాలు కలుస్తున్నాయి. పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయి. వియత్నానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ ఫాస్ట్ ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తితో ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. భూమి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని.. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు కోరారు. విన్ ఫాస్ట్ వియత్నానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థ. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని ఆసక్తితో ఉంది. తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగినా నిర్మాణం జరపలేదు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, అమరావతి కొత్త రాజధాని ప్రాంతం కావడంతో తమ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* విన్ ఫాస్ట్ పరిశ్రమ ఆసక్తి..
అయితే ఒక్క విన్ ఫాస్ట్ పరిశ్రమమే కాదు. చాలా పరిశ్రమలు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే చంద్రబాబు సైతం చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదుకు పెట్టుబడుల వరద వచ్చింది. ఆ సమయంలో పారిశ్రామిక అభివృద్ధి పై మాత్రమే చంద్రబాబు దృష్టి పెట్టారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం అయ్యారు. మరోసారి అమరావతిలో అదే పరిస్థితి కనిపిస్తోంది.స్వదేశీ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ఏపీకి వస్తుండగా.. విద్య, ఆరోగ్య, టూరిజం ప్రాజెక్టులు సైతం వస్తుండడంతో.. మరో హైదరాబాద్ దిశగా అమరావతి ప్రయాణించడం ఖాయమని ఏపీ ప్రజలు ఆశతో ఉన్నారు. మరి వారి ఆశలను చంద్రబాబు ఎంతవరకు తీర్చగలరో చూడాలి.