TDP Janasena BJP Alliance: ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారా? ఈ మేరకు వేదిక ఫిక్స్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన కూటమిలోకి బిజెపి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం విధితమే. అటు ఆరేళ్ల తర్వాత ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ లాంఛ నమేనని తేలింది. ఈ తరుణంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అయితే దీనిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో గడిపిన ఆ ఇద్దరు నాయకులు శనివారం సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్నారు. సీట్ల సర్దుబాటు తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే సిద్ధం పేరిట ఎన్నికల ప్రచారానికి జగన్ తెర తీశారు. ఇప్పటివరకు నాలుగు సభలను పూర్తి చేశారు. లక్షలాదిమంది జన సమీకరణ చేశారు. దానికి ధీటుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. మూడు పార్టీల నేతలతో తొలి ఉమ్మడి సభ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇకపై ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా అడుగులు వేయబోతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఈ మూడు పార్టీలు ముందుగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసి జనంలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి.
టిడిపి,జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ఈనెల 17న ముహూర్తం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సభను నిర్వహించనున్నారు. అయితే బిజెపితో పొత్తు కుదిరిన నేపథ్యంలో మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో గా ఈ వేదిక మారబోతోంది. బిజెపి తరుపున చేర్చాల్సిన హామీలను కూడా చేర్చి కొత్త మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తద్వారా ఎన్డీఏ వర్సెస్ వైసీపీ అన్న వాతావరణం తెచ్చేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రత్యేక వ్యూహం రూపొందించుకున్నట్లు సమాచారం. అయితే ప్రధాని ఎన్నికల ప్రచార షెడ్యూల్ తో బిజీగా గడుపుతున్నారు. చిలకలూరిపేట సభకు తక్కువ సమయం ఉండడంతో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు అవుతుందా? లేదా? అన్నది చూడాలి.