TMC: మోడీ చెప్పినట్టేజరుగుతోందే.. అందుకే ఆ క్రికెటర్ ను దింపారా?

ఇండియా కూటమిలోని పార్టీలు బెంగళూరులో భేటీ అయినప్పుడు అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించాయి. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

Written By: Velishala Suresh, Updated On : March 10, 2024 4:30 pm

TMC

Follow us on

TMC: “ఇండియా కూటమి అనేక పార్టీల సమ్మేళితం. అది ఉంటుందో, విచ్చిన్నమవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు దాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? నమ్మి ఎలా ఓట్లేస్తారు?” ఇవీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసినట్టుగానే ఇండియా కూటమిలో లుకలుకలు బయట పడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు బిజెపిలో చేరారు. మరికొంతమంది లైన్ లో ఉన్నారు. కేరళ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. ఇక భాగస్వామ్య పార్టీలకు కాంగ్రెస్ పొడ అంటే గిట్టడం లేదు. పైగా సీట్ల కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మిగతా పార్టీలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికే బీహార్లో నితీష్ దూరమయ్యాడు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించింది.త్వరలో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఇండియా కూటమిలో పరిస్థితి బాగోలేదు. ఇక ముందు బాగుంటుందన్న సంకేతాలు లేవు.

యూసఫ్ పఠాన్ చేరిక..

ఇండియా కూటమిలోని పార్టీలు బెంగళూరులో భేటీ అయినప్పుడు అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించాయి. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో అతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బెహరం పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో దిగుతారని మమత ప్రకటించారు. ఆదివారమే తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యూసుఫ్ కు మమతా బెనర్జీ వెంటనే టికెట్ కేటాయించడం విశేషం. పార్టీలో చేరిన వెంటనే అతడు కోల్ కత్తా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్నాడు. ఇదే వేదిక నుంచి మమతా బెనర్జీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా..

ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ తన దారి తనదే అన్నట్టుగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారు. ఆదివారం 42 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కూడా అటువంటిదే. మమత బెనర్జీ అభ్యర్థులను ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నోరు మెదపడం లేదు. ఇటీవల ఆ పార్టీ మొదటి దశ అభ్యర్థులను ప్రకటించింది. అప్పుడు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలను సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపించాయి. ఇక యూసఫ్ పఠాన్ కు కేటాయించిన బెహరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదురి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకే యూసుఫ్ కు మమత టికెట్ కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధీర్ రంజన్ చౌదురి ఈసారి కూడా బెహరంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు బెంగాల్ రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇలా ఎవరికి వారు ఎంపీ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతే ఇండియా కూటమికి అర్థం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దానికి కూటమిలోని ఏ పార్టీ నుంచి కూడా సమాధానం రావడం లేదు. ఎందుకంటే జరుగుతున్నది ఏమిటో ఆ కూటమిలోని పార్టీలకు తెలుసు కాబట్టి. మోడీ అన్నట్టుగానే లుకలుకలతో ఇబ్బంది పడుతున్న ఇండియా కూటమి.. ఎన్నికల్లో బలం సాధిస్తుందా? మోడీని ఓడిస్తుందా? లేక మూడోసారి అధికారాన్ని అప్పగిస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.