Anakapalli: అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ స్థానం నుంచి గెలుపొందేవారు తప్పకుండా మంత్రి అవుతారని ఒక సెంటిమెంట్ నడుస్తోంది. 2014 ఎన్నికలకు తప్పించి.. దాదాపు అన్ని ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచినవారు మంత్రులవుతూ వచ్చారు. అందుకే అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి ఆశావహులు ఎక్కువ. తాజాగా ఇక్కడ వైసిపి అభ్యర్థిగా మలసాల భరత్ ను జగన్ ప్రకటించారు. టిడిపి,జనసేన కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలో దిగనున్నారు. కొణతాల రామకృష్ణ గెలిచి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఆయన మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఇక్కడ గెలిచేందుకు కొణతాల రామకృష్ణ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 9 ఎన్నికలు జరిగాయి. అందులో ఆరుసార్లు టిడిపి విజయం సాధించింది. నాలుగుసార్లు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. 2004లో మాత్రం దాడి వీరభద్రరావు పై కొణతాల రామకృష్ణ గెలుపొందారు. ఆయన సైతం మంత్రి అయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో పిఆర్పి విలీనం నేపథ్యంలో ఆయన సైతం మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి పీల గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మాత్రం మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి దక్కించుకున్నారు.2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణతాల రామకృష్ణ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో త్రిముఖ పోరులో గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపి అభ్యర్థికి 65 వేల ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి 12,000 ఓట్లు సాధించారు. కానీ 73 వేల ఓట్లు తెచ్చుకున్న అమర్నాథ్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఈసారి టిడిపి, జనసేన కూటమి కట్టడం.. కొణతాల రామకృష్ణ అభ్యర్థి కావడం.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టిడిపిలోకి రావడం.. తదితర కారణాలతో కూటమి అభ్యర్థి బలంగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల మాదిరిగా వైసీపీ గెలుపు సులువు కాదు. ఈ నేపథ్యంలోనే కొణతాల ఎమ్మెల్యే అవుతారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. మంత్రి పదవి దక్కించుకుంటారని.. ఒక సెంటిమెంట్ ప్రచారం నడుస్తోంది. అయితే అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.