Vijayasai Reddy : వైసీపీలో పవర్ సెంటర్లు మారుతుంటాయి.. కాదు కాదు జగన్ మార్చేస్తుంటారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో వెన్నంటి చాలా మంది నడిచారు. అటువంటి వారంతా ఇప్పుడు కనుమరుగయ్యారు. తొలినాళ్లలో కొణతాల రామక్రిష్ణ, గోనె ప్రకాశరావు, కొండా సురేఖ దంపతులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు జగన్ వెంట నడిచారు. కానీ వారంతా కొద్దికాలానికే తెరమరుగయ్యారు. పార్టీకి దూరమయ్యారు. పార్టీలో నంబర్ 2 స్థానం కూడా నిలకడగా ఉండడం లేదు. తొలుత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తరువాత విజయసాయిరెడ్డి, ఇప్పుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఇలా నంబర్ 2 స్థానం మారిపోతుంటుంది. నేతలు తోక జాడిస్తే జగన్ ఇట్టే కత్తిరిస్తుంటారు.
ఇప్పుడు పార్టీలో తన పొజిషన్ ఏదో విజయసాయిరెడ్డికి అంతుపట్టడం లేదు.చేతిలో ఒక్క రాజ్యసభ పదవి తప్ప మరేమీ మిగలకుండా జగన్ కత్తిరించేశారు. వైఎస్ ఫ్యామిలీలో విజయసాయిది ప్రత్యేక స్థానం. ఎక్కడో ఆడిటర్ గా ఉన్న ఆయన లోటస్ ఫండ్ లో ఎంటరై పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎగబాకారు. వైసీపీని తన సొంత పార్టీలా ఓన్ చేసుకున్నారు. బహుశా పార్టీ కోసం జగన్ కూడా అంతలా కష్టపడి ఉండరు. పార్టీ కోసం, అధినేత చెప్పిన పని కోసం విజయసాయి ఢిల్లీ పెద్దల వద్ద సాష్టాంగం పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టానికి తగ్గట్టే ప్రతిఫలం లభించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డికి జగన్ మంచి పొజిషన్ కల్పించారు. కానీ ఇప్పుడు నువ్వు ముసలొడివి అయ్యావు సాయన్న.. పక్కకు తప్పుకో.. అంటూ ఆయన బాధ్యతలన్నీ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించేశారు.
విజయసాయిరెడ్డి ఇప్పుడు కీలక నేత నుంచి సామాన్య కార్యకర్తగా మారిపోయారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతలను తీసేసి బాబాయ్ వైవీసుబ్బారెడ్డి చేతిలో పెట్టారు. సోషల్ మీడియా విభాగాల ఇన్ చార్జి స్థానాన్ని సజ్జల కుమారుడు భార్గవ్ కు అప్పగించారు. ఇప్పుడు అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతను చెవిరెడ్డి కి ఇచ్చేశారు. ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలోనే జగన్ ఈ మాటను సౌండ్ చేసి చెప్పారు. అక్కడే విజయసాయి ఉన్నారని… కనీసం బాధపడతారని కూడా చూడకుండా ముసలితనం అన్న కొలమానం తీసుకొచ్చి పక్కనపడేశారు.
అయితే జగన్ మాటలు విజయసాయికి చాలా బాధ కలిగించాయట. కానీ పార్టీపై, అధినేతపై ఉన్న అభిమానంతో తనలో తాను సర్దుబాటు చేసుకుంటున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతోందని అనుమానిస్తున్నారు. పార్టీ కోసం ఇంత చేస్తే అన్నట్టు లోలోపల మధనపడుతున్నారు. అయితే ఏదో ఒక రోజు విజయసాయిరెడ్డి బయటపడక తప్పని పరిస్థితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక ఆడిటర్ గా ఎంటరై స్టేట్ పాలిటిక్స్ నే శాసించిన విజయసాయిని చూసి చాలా మంది సీనియర్లు సైతం ఆశ్చర్యపడ్డారు. ఏదో రోజు తేడా కొడుతుందని ఊహించారు. సేమ్ అదే సీన్ వెలుగుచూసింది. అందుకే ఇప్పుడు పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు.