YS Jagan : జగన్ వైఖరి పై సొంత పార్టీ శ్రేణుల్లో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను కలిసేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. తాడేపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలిస్తారని ప్రకటించారు. కానీ ఉన్నఫలంగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రారంభించకుండానే బెంగళూరు బయలుదేరారు జగన్. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
ఓటమి తరువాత జగన్ తాడేపల్లి లో ఉండేందుకు ఇష్టపడడం లేదు. వీలైనంతవరకు పులివెందుల, బెంగళూరులో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో బెంగళూరు వెళ్లడం ఇది రెండోసారి.ఇడుపాలపాయలో జగన్ కు భారీ భవనం ఉంది. విలువైన ఆస్తులు ఉన్నాయి. బెంగళూరులో అయితే ఎలహంక ప్యాలెస్ ఉంది. అటు హైదరాబాదులో సైతం విలువైన ఆస్తులు ఉన్నాయి.కానీ హైదరాబాదులో ఉండేందుకు మాత్రం జగన్ ఇష్టపడడం లేదు. ఉంటే పులివెందులలో, లేకుంటే బెంగళూరులో ఉండేందుకు మాత్రమే ఆయన ఇష్టపడుతున్నారు. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు. ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు. తన స్నేహితుడు కేసిఆర్ కు ప్రత్యర్థి. అందుకే అక్కడ ఉంటే ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని జగన్ భావిస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వైయస్ కుటుంబ సన్నిహితుడు డి.కె శివకుమార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అందుకే అక్కడ ఉండేందుకు జగన్ ఇష్టపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో వైసిపి విలీన ప్రక్రియ వార్తలు ఆ మధ్యన వచ్చాయి.చాలా రోజుల పాటు ప్రచారం తరువాత డీకే శివకుమార్ దానిని ఖండించారు. తాను జగన్ ను కలవలేదని తేల్చి చెప్పారు. అయితే వారి మధ్య భేటీ జరిగిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ మరోసారి బెంగళూరు వెళ్లడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. దీని వెనుక రాజకీయ కోణం ఉందని టాక్ నడుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనకు వెళ్తానని జగన్ ప్రకటించారు.దాడులు, కేసులతో ఇబ్బంది పడుతున్న వైసీపీ శ్రేణులను పరామర్శిస్తారని చెప్పుకొచ్చారు. ఇంతలో తాడేపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ప్రకటించారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి వినతులు స్వీకరించి భరోసా ఇస్తారని చెప్పారు. కార్యక్రమం ప్రారంభించకుండానే వాయిదా వేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను స్వీకరణకు స్పందన కార్యక్రమాన్ని రూపొందించారు. దానిని ప్రారంభించకుండానే వాయిదా వేశారు. అసలు ప్రజలను నేరుగా కలిసేందుకు జగన్ ఇష్టపడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటున పర్యటనలు చేసేవారు. బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమయ్యేవారు. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే ప్రజల ముందుకు వచ్చారు.
మొన్న ఆ మధ్యన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారు. చాలా దూకుడుగా వ్యవహరించారు. రాజకీయ దాడులు, కేసులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నేరుగా సీఎం చంద్రబాబుకు హెచ్చరించారు. ఇక్కడి నుంచి తాను దూకుడుగానే ఉంటానని సంకేతాలు పంపారు. కానీ తర్వాత మళ్లీ స్లో అయ్యారు. ఇప్పుడు ఏకంగా ప్రజా దర్బారు ప్రారంభించకుండానే వాయిదా వేసి బెంగళూరు వెళ్ళిపోతున్నారు. దీనిపై వైసీపీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. అసలు అధినేత వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నారు? జాతీయస్థాయిలో ఎలా ముందుకు వెళ్ళనున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారా? అందుకే తరచూ బెంగుళూరు వెళ్తున్నారా? అన్న చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What is the reason for jagan not wanting to meet the people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com