Nara Bhuvaneshwari: బాబుకు రెస్ట్ యేనా? భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి?

కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించింది.

Written By: Dharma, Updated On : February 22, 2024 11:45 am
Follow us on

Nara Bhuvaneshwari: కుప్పం నుంచి ఈసారి చంద్రబాబు తప్పుకుంటారా? నారా భువనేశ్వరి పోటీ చేస్తారా? ఇది వ్యూహమా? వ్యూహాత్మకమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.’చంద్రబాబు గారికి రెస్ట్ ఇవ్వాలి. ఈసారి నేనే పోటీ చేద్దామనుకుంటున్నాను’ అని భువనేశ్వరి ప్రకటించారు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏపీలో పొత్తులు కుదురుతున్న వేళ భువనేశ్వరి నుంచి వచ్చిన ఈ ప్రకటన పెను ప్రకంపనలకు కారణమవుతోంది.పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నుంచి పవర్ షేరింగ్ కోరుకుంటున్న జనసైనికులు, కాపు సామాజిక వర్గం ఆసక్తిగా గమనించడం గమనార్హం.

కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించింది. నియోజకవర్గ పరిధిలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీ సైతం హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి వైసిపి వై నాట్ కుప్పం అన్న స్లోగన్ తో ముందుకు సాగుతోంది. చివరకు చంద్రబాబు పర్యటనలను సైతం అడ్డుకుంది. ఈ పరిణామాల క్రమంలో కుప్పం నియోజకవర్గం పై చంద్రబాబు పట్టు తప్పిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు భువనేశ్వరి సైతం కుప్పంలో పర్యటించారు. అక్కడి ప్రజల్లో ఒక రకమైన చర్చ లేపడానికి భువనేశ్వరి ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తారని..కూటమికి స్టార్ క్యాంపైనర్ గా ఉంటూ.. సమన్వయం చేసుకున్నారని.. అందుకే కుప్పం నుంచి ఈసారి చంద్రబాబు తప్పుకొని భువనేశ్వరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని స్వీకరించి.. ముఖ్యమంత్రి పదవిని చేపడతారని టాక్ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత భువనేశ్వరి బయటకు వచ్చారు. రాజకీయ వేదికల్లో పాలుపంచుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుతో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కుప్పం పర్యటనలో ఉన్నారు. నేరుగా తానే పోటీ చేయాలని ఉందని ఆమె ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలతో జనసేన, కాపు సామాజిక వర్గంలో మరో చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకుంటే.. పవర్ షేరింగ్ విషయంలో ఒక స్పష్టతనిచ్చినట్టు అవుతుందని.. రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందని.. అందులో భాగంగానే కుప్పం నుంచి భువనేశ్వరి బరిలో దిగుతారని తెలుస్తోంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.