AP BJP: ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి బిజెపి ప్రాతినిధ్యం పెరిగింది. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో రాష్ట్ర మంత్రి ఒకరు అయ్యారు. ముగ్గురు ఎంపీలు అయ్యారు. అందులో ఒకరు కేంద్రమంత్రిగా ఎంపికయ్యారు. అయితే ఇంత ప్రాతినిధ్యం పెరిగినా ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారు బిజెపి ప్రజా ప్రతినిధులు. సాధారణంగా అయితే బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నందున.. బిజెపి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు ఎంతో ప్రాధాన్యం దక్కాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో కూటమి ఉండడం.. ఎన్ డి ఏ 3 అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం కావడంతో.. ఏపీ నుంచి చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ ను బిజెపి బలంగా నమ్ముతోంది. దాని ఫలితంగా బిజెపి ప్రజా ప్రతినిధులకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. రాష్ట్ర శాసనసభలో వారు సాధారణ ఎమ్మెల్యేలుగా మారారు. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
* ప్రాతినిధ్యం పెరిగినా
ఏపీలో పొత్తులో భాగంగా బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో, ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మూడు పార్లమెంట్ స్థానాలను గెలుపొందింది. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ రాష్ట్ర క్యాబినెట్లో స్థానం పొందారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలిచారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ బిజెపికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వపరంగా ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు.
* సీనియర్ నేతలు ఉన్నా
బిజెపి నుంచి ఈసారి ఎమ్మెల్యేలుగా సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారు ఎన్నికయ్యారు. విశాఖ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు సైతం పోటీ చేసి గెలిచారు. అయితే వారంతా నామమాత్రం అయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన సత్య కుమార్ యాదవ్ పెద్దగా ముద్రచూప లేకపోతున్నారు. కేంద్ర మంత్రిగా ఎన్నికైన శ్రీనివాస వర్మ సైతం పార్టీ బలమైన ఉనికి చాటుకునే వ్యవహరించడం లేదన్నది ఆరోపణ. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం బిజెపి బలంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం లేదన్న విమర్శ ఉంది. అయితే పేరుకే బిజెపికి ప్రాతినిధ్యం పెరిగింది కానీ.. ఆ పార్టీ బలం పెంచుకోలేకపోవడం లోటు.