TDP: ఒకప్పుడు ఎన్నికలంటే.. ఇంత హడావిడి ఉండేది కాదు. పోలింగ్ అయిపోయిన తర్వాత.. ఫలితాల వెల్లడి రోజే కాస్తో, కూస్తో సందడి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికలంటే మీడియా హడావిడి మామూలుగా ఉండడం లేదు. సోషల్ మీడియాలో చర్చలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇక ఏజెన్సీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పలానా ఏజెన్సీ సర్వే చేస్తే పలానా పార్టీకి అధికారంలోకి వస్తుందని తేలిందని చెప్పడం ఇటీవల ఎక్కువైంది. ఆ ఏజెన్సీలకు ఉన్న సామర్థ్యం ఎంత? వాటికి ఉన్న విశ్వసనీయత ఎంత? ఇవేవీ లేకుండానే ఫలితాలు ప్రకటిస్తున్నాయి. వీటిని చూసి పార్టీలో డబ్బాలు కొట్టుకుంటున్నాయి. అయితే గత ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థలు చెప్పిన వివరాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. అయితే ఆ సంస్థలు ఏపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సర్వే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీ – ఓటర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో టిడిపికి అనుకూలంగా ఫలితాలు రావడంతో ఆ పార్టీ తెగ హడావిడి చేస్తోంది. నిజంగా సీ – ఓటర్ సామర్థ్యం ఆ స్థాయిలో ఉందా? దానికి ఉన్న విశ్వసనీయత ఎంత? అనేవి ఒకసారి పరిశీలిస్తే..
ఏపీలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 17 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని సీ – ఓటర్ సంస్థ ఇటీవల ప్రకటించింది. దీంతో టిడిపి నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ఇదే సీ – ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 53 వరకు సీట్లు వస్తాయని ప్రకటించింది. కానీ చివరికి 35 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 54 సీట్లతో బిజెపి అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 133 స్థానాలు వస్తాయని సి ఓటర్ సంస్థ ప్రకటించింది. కానీ చివరికి 66 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతిమంగా బిజెపి అధికారాన్ని దక్కించుకుంది. ఇక గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని, 14 పార్లమెంటు స్థానాలు దక్కుతాయని చెబితే.. చివరికి మూడు ఎంపీలు, 23 ఎమ్మెల్యే సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఇలాంటి విశ్వసనీయత లేని సంస్థను పట్టుకొని తెలుగుదేశం నాయకులు సంబరపడుతున్నారంటే.. దాన్ని ఎలా స్వీకరించాలో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టి చేసేదే నిజమైన సర్వే. దానికే విశ్వసనీయత ఉంటుంది. అలాకాకుండా ఇష్టానుసారంగా సర్వే చేసి.. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా నివేదిక ఇస్తే.. అది సబబు అనిపించుకోదు. పైగా ఇలాంటివి ఓటర్ల నాడిని మార్చలేవు. మీడియా చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే జనం నమ్మే రోజులు కావు ఇవి. పైగా సి ఓటర్ సంస్థ గతంలో చేసినట్టు ఇప్పుడు సర్వే చేయడం లేదనే విమర్శలున్నాయి.