Ganta Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రతిపక్ష టీడీపీలో ఆ పార్టీ ప్రకటించిన సెకండ్ లిస్ట్ చిచ్చు రేపింది. ఈ జాబితాలోనూ సీనియర్లకు ఛాన్స్ దక్కలేదు. దీంతో అసంతృప్తి భగ్గుమంది. 34 మంది అభ్యర్థుల పేర్లతో విడుదలైన రెండో జాబితాలో సీనియర్ల పేర్లు లేవు. దీంతో తమ దారి తాము చూసుకుంటామంటున్నారు. కొందరు ఇండిపెండెంట్లుగా దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే, కొందరు పార్టీ శ్రేణులు, అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు పార్టీ వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో గంటా శ్రీనివాస్‌రావు ముందు వరుసలో ఉన్నారు.
అనుచరులతో గంటా భేటీ..
ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావుకు కూడా రెండు లిస్టులో టికెట్ దక్కలేదు. ఆయనను మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. దీనికి గంగా ససేమిరా అంటున్నారు. ఆయన బీమిలి టికెట్ ఆశిస్తున్నారు. అది కూడా ఇచ్చేందుకు అధిష్టానం అనుకూలంగా లేదు. దీంతో గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మారాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా గంటా టీడీపీకి షాక్ ఇస్తారని తెలుస్తోంది.
టికెట్ దక్కని సీనియర్లు..
టీడీపీ సెకండ్ లిస్ట్‌లో టికెట్ దక్కని సీనియరు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టికెట్‌ను మాజీ మంత్రి జవహర్ ఆశించారు. కానీ చంద్రబాబు అక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావుక ఛాన్స్ ఇచ్చారు. దీంతో జవహర్ స్వతంత్రంగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీ టికెట్ ఆశించారు. కానీ ఆస్థానం జనసేనకు వెళ్లడంతో ఆయన పార్టీని వీడారు. కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ ఆశించారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ప్రసాద్ అనుచరులు మూకుమ్మడిగా టీడీపీకి రాజీనామా చేశారు. ఇక సర్వేపల్లి టికెట్ సోమిరెడ్డికి ఇంకా ఖరారు చేయలేదు. ఆయనకు హ్యాండ్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సెకండ్ లిస్ట్ తో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. మూడో లిసస్ట్ కూడా విడుదలైతే.. టీడీపీలో అసంతృప్త జజ్వాలలు మరింత రగిలే అవకాశం ఉంది.